ట్రంప్ తీసుకువచ్చిన విధానాల వల్ల చదువుతూ బైట పార్ట్ టైం చేసే అవకాశం లేదు. అలా చేస్తే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారు దేశంలోకి అక్రమంగా తరలి వచ్చారని ఇక శాశ్వతంగా అమెరికాలోనికి ప్రవేశించకుండా చేసేస్తారు. దీనితో చాలామంది విద్యార్థులు భయపడిపోయి పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. దీనితో వారి నెలవారీ ఖర్చులకు భారతదేశంలో తమ తల్లిదండ్రులను అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రకారంగా వారికి నెలకి కనీసం 70 నుంచి లక్ష రూపాయల వరకూ ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది.
అమెరికా వదిలేసి రమ్మంటే ఏడుస్తున్నారు
ఈ పరిస్థితిని గమనించి కొంతమంది తల్లిదండ్రులు ఇక అమెరికాలో వున్నది చాలు... వచ్చేయమంటుంటే అక్కడ జీవనానికి అలవాటు పడిని యువతీయువకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా ఇక్కడే సాధిస్తామంటూ నచ్చచెబుతున్నారు. కానీ తమ బిడ్డల పరిస్థితి చూస్తుంటే తమకు ఆందోళనగా వుందని చెబుతున్నారు తల్లిదండ్రులు.
ఊళ్లోవాళ్లకి నీ ముఖం ఎలా చూపిస్తావ్ నాన్నా...
తన బిడ్డను రూ. 10 లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదిస్తానంటే పంపాను, కానీ ఇప్పుడు వాడికి ఉద్యోగం లేదు. ఏదో షాపులో చేస్తున్నాడట... పట్టుకుంటే వీసా క్యాన్సిల్ చేస్తారని చదివి... అమెరికా నుంచి వచ్చేయిరా అని అంటుంటే, ఊళ్లో వాళ్లకి నీ ముఖం ఎలా చూపిస్తావు నాన్నా అంటున్నాడని ఓ క్యాబ్ డ్రైవర్ చెబుతున్నారు. ఇలా అమెరికాలో చదువులు కోసం, ఉద్యోగాల కోసం తమ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతంగా వుంది.