ఫిక్సింగ్ వ్యవహారం షాహిద్ అఫ్రీదికి ముందే తెలుసా?!

FILE
పాకిస్థాన్ క్రికెటర్లు అడ్డంగా దొరికిపోయిన "స్పాట్ ఫిక్సింగ్" వ్యవహారం పాకిస్థాన్ టెస్టు జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదికి ముందే తెలుసునట. క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చిన 'స్పాట్ ఫిక్సింగ్' కుంభకోణంలో ప్రధాన సూత్రధారి పాకిస్థానీ మజహర్ మజీగద్ విషయం అఫ్రిదికి ముందే తెలుసునని, అందుకే అఫ్రిది అసంతృప్తితో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని సమాచారం.

పాక్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సమయంలో మజహర్, అతని సోదరుడు అజహర్ మజీద్‌లను జట్టు సభ్యులకు దూరంగా ఉంచాలని మేనేజ్‌మెంట్‌ను ఆఫ్రిది హెచ్చరించాడట. ఆ సోదరులను డ్రెస్సింగ్ రూమ్‌లోకి గానీ, జట్టు బస చేసిన హోటల్‌లోకి గానీ అనుమతించకూడదని మేనేజర్ యావర్ సయీద్‌కు కూడా అఫ్రిదీ సూచించాడట.

అయితే జరగబోయే పరిణామాలను ముందే పసిగట్టిన అఫ్రిది, ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఓటమి అనంతరం కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడని సన్నిహితుల సమాచారం. మజీద్ సోదరుల ప్రభావం జట్టుపై ఎంత బలీయంగా ఉందంటే, టెస్టు సారథ్యానికి గుడ్‌బై చెప్పిన అఫ్రిదిని కొందరు జట్టు సభ్యులు వన్డే, టి20 కెప్టెన్‌గా కూడా షాహిద్‌ను వద్దనుకున్నారట..!

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ క్రికెటర్ల కక్కుర్తి ఫలితం ఏ స్థాయికి చేరుకుందో బుకీల ఖరీదును బట్టి అర్థమవుతోంది. పాకిస్థాన్ ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో పాల్గొంటే అంతమేలని బుకీలు భావిస్తున్నారట. తాజాగా ఫిక్సింగ్ వ్యవహారంలో బుకీలకు రూ.135కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట. ఇందులో ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం పాక్ క్రికెటర్లకు రూ.40కోట్లకు పైగా వాటా లభించిందని తెలిసింది.

మరోవైపు పాకిస్థాన్ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే విషయం వెలుగులోకి రాగానే ఆ దేశ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఫిక్సింగ్ వ్యవహారంలో ప్రమేయమున్న ఆటగాళ్లకు స్వదేశంలో ప్రాణాపాయం ఉందని భద్రతా అధికారులు హెచ్చరిస్తున్నారు. కెప్టెన్ సల్మాన్ భట్‌‍తో పాటు ఏడుగురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే విషయంపై ప్రజలే కాదు.. అక్కడి తీవ్రవాదులు సైతం ఆగ్రహంతో ఊగిపోతున్నారని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే పాక్ జట్టులోని 'ఆ ఏడుగురి' తలలకు ఉగ్రవాదులు వెలకట్టే ప్రమాదం లేకపోలేదని 'డెయిలీ స్టార్' పత్రిక కూడా వెల్లడించింది.

అలాగే తమ క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో పాక్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. లాహోర్ వీధులను నిరసనలతో హోరెత్తింపజేస్తుండగా, మరి కొందరు గాడిదల నుదిటిపై ఫిక్సింగ్ పాల్పడ్డారని భావిస్తున్న ఆటగాళ్ల పేర్లు రాసి వాటిని ఊరేగించారట. ఆటగాళ్ల మీద కసితో, పాపం ఆ గాడిదలను బూట్లతోనూ, కుళ్లిన కూరగాయలతోనూ కొట్టుకుంటూ నడిపించారు. అంతేగాకుండా, ప్లకార్డులు చేతబూనిన నిరసనకారులు, కెప్టెన్ సల్మాన్ భట్, వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ లను శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

ఇకపోతే.. మ్యాచ్ ఫిక్సింగ్‌పై నిజానిజాలేంటో ఇంకా తేలకముందే, పాక్ 'ఫిక్సింగ్' ఆటగాళ్లపై తాత్కాలిక చర్యకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజా జరుగుతున్న ఇంగ్లండ్ పర్యటన నుంచి నలుగురు పాక్ క్రికెటర్లను తప్పించాలని ఐసిసి, పాక్ బోర్డులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కెప్టెన్ సల్మాన్ బట్‌తో పాటు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్, ఆమెర్, కమ్రాన్ అక్మల్‌లు ఇంగ్లండ్ పర్యటన నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యే అవకాశముందని తెలిసింది.

కాగా.. పాకిస్థాన్ క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు మరోసారి కోచ్‌గా పనిచేసేందుకు తాను సిద్ధమంటూ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ ముందుకొచ్చాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాళ్లతో పాటు మేనేజ్‌మెంట్ స్థానంలో వేరేవారిని నియమించాలని పీసీబీని మియాందాద్ కోరాడు.

వెబ్దునియా పై చదవండి