భవిష్యత్ ప్రపంచ ఛాంపియన్: క్రికెట్ దిగ్గజాల కామెంట్స్!
ఉత్కంఠభరితమైన సెమీఫైనల్ పోరులో భారత్ పాక్‌ని మట్టికరిపించిన ఒక రోజు తర్వాత ఇక ఏప్రిల్ 2న వాంఖడే స్టేడియంలో జరిగే ఫైనల్లో గెలిచి ఎవరు కప్ కైవసం చేసుకుంటారనే జోస్యం చెప్పడంలో గతంలో క్రికెట్ దిగ్గజాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రచార కార్యక్రమంలో తమతమ దేశాలకు ప్రపంచ కప్‌లను అందించిన అలనాటి మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, అలెన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్, ఇమ్రాన్ ఖాన్లు ప్రపంచ కప్ విజేత ఎవరనే అంశంపై స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.
ఈ దిగ్గజాలు ఎవరు కప్ సాధిస్తారనే దానిపై తమ తమ అభిప్రాయాలతో నిలువునా చీలారు. అన్ని విభాగాల్లో అత్యంత సమతుల్యంగా ఉన్న శ్రీలంకే విజేతని అలెన్ బోర్డర్ అభిప్రాయపడగా ఎంతో ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకొని ఫైనల్‌కు చేరిన ఇండియానే తన ఛాయిస్ అని అయితే శ్రీలంక గట్టి పోటీనిస్తుంది. ఇండియా ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్లు ఆడనప్పటికీ కసితో ముందుకు వెళ్తున్నారని వారికి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అంత ఒత్తిడి లేదని పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
భారత జట్టుకు సలహా ఇవ్వమని కపిల్ దేవ్‌ని అడిగినపుడు ఆటను ఆస్వాదిస్తే చాలన్నాడు. వారు ఒత్తిడికి లోనుకాకుండా ఆటను ఎంజాయ్ చేస్తే చాలన్నదే తన సూచన అన్నాడు. ఈ కప్‌లో సచిన్ ప్రదర్శనపై మాట్లాడుతూ సచిన్ కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు, మనం మాట్లాడుకోనే దాని కంటే వంద రెట్ల ఎత్తులో సచిన్ ఉన్నాడని కపిల్ వ్యాఖ్యానించాడు.
శ్రీలంక రెండో సారి ప్రపంచ కప్ సాధించే అవకాశం లేకపోలేదని 1996లో శ్రీలంకకు ప్రపంచ కప్ సాధించిపెట్టిన ఆ జట్టు మాజీ సారధి అర్జున రణతుంగ చెప్పుకొచ్చాడు. వెస్టీండీస్ మాజీ సారధి క్లైవ్ లాయిడ్ మాట్లాడుతూ క్యాచ్‌లే మ్యాచ్‌ని గెలిపిస్తాయని, భారత్-పాక్ మ్యాచ్‌లో కూడా అదే జరిగిందని చెప్పారు. అయితే శ్రీలంకపై భారత్‌దే పై చేయి అని చెప్పుకొచ్చాడు.