ఆ మేటి "స్టార్" ఆటగాళ్లు రిటైర్ అయ్యేదెప్పుడు..?!!

శనివారం, 28 జనవరి 2012 (12:59 IST)
FILE
టీమ్ ఇండియా మరోసారి వైట్ వాష్ వేసుకుంది. కనీసం చివరి టెస్ట్ మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు దక్కించుకుంటుందంటే.. ఆ ప్రయత్నం చేసినట్లే కనబడలేదు. తమదైన స్టయిల్‌లో వైట్ వాష్ వేయించుకుని వెనుదిరిగింది. దీంతో ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లు టీం నుంచి గౌరవంగా తమకు తాముగా తప్పుకోవాలన్న వాదనలు బహిరంగంగానే వినబడుతున్నాయి.

మేటి ఆటగాళ్లు తమ ఆటతీరు నెం.1గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తే గౌరవప్రదంగా ఉంటుందనీ, అలాకాకుండా చెత్త ప్రదర్శన చేస్తూ జట్టు పరాజయాలకు పాత్రులవడంతో అంతకుముందు నెలకొల్పిన రికార్డులను అభిమానులు పట్టించుకునే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అంటున్నారు. దీనికి ఉదాహరణలను కూడా వారు ఉటంకిస్తున్నారు.

గ్రేట్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో పూర్తి స్వింగ్‌లో ఉన్నారు. బెంగళూరులో పాకిస్తాన్ జట్టుపై 96 పరుగుల భారీ స్కోరు చేశాక ఆయన తన రిటైర్మెంట్‌ను గర్వంగా ప్రకటించారు. అప్పట్లో గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటనను క్రీడాభిమానులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ గవాస్కర్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. అలా కెరీర్ శిఖరాన ఉన్నప్పుడే వైదొలిగడంతో గవాస్కర్ పేరు చెబితే రికార్డుల మోతే గుర్తుకు వస్తుంది.
FILE


కానీ నేటి సీనియర్ ఆటగాళ్ల పరిస్థితి దీనికి భిన్నంగా ఉందంటున్నారు. మాస్టర్ బ్లాస్టర్‌గా కీర్తి గడించిన సచిన్, ది గ్రేట్ వాల్ అని ప్రశంసలు అందుకున్న రాహుల్ ద్రవిడ్ జనం చేత చెప్పించుకుని రిటైర్మెంట్ ప్రకటిస్తారా..? అనే వ్యాఖ్యలు కొందరు బాహాటంగానే అనేస్తున్నారు. సచిన్ మైదానంలోకి వస్తున్నాడంటే గ్యాలరీలోని కుర్చీలకు అతుక్కుపోయి చూసే క్రీడాభిమానుల్లో ఈ టైపు అభిప్రాయం రాక మునుపే మేటి ఆటగాళ్లు గౌరవంగా తప్పుకుని కుర్రాళ్లకు స్థానం కల్పించాలని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వైట్ వాష్‌తో సీనియర్ ఆటగాళ్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి