గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలకు తగిన బుద్ధి చెప్పిన ధోనీ సేన..!

గురువారం, 30 డిశెంబరు 2010 (17:16 IST)
FILE
డర్బన్ టెస్టు ద్వారా దక్షిణాఫ్రికాపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రెండవ టెస్టు ప్రారంభానికి ముందు భారత ఆటగాళ్లను అవమానించే రీతిలో సఫారీల కెప్టెన్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఆమ్లాను అవుట్ చేసే భారత బౌలర్లకు ఉందా అని ఎద్దేవా చేశాడు.

అలాగే సెంచూరియన్ మైదానంలో ఆడే ఛాన్సు తమకు వచ్చి ఉంటే.. భారత్‌ లాగా చెత్తగా ఆడి వుండే వాళ్లమని కాదని గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలకు భారత బౌలర్లు తగిన బుద్ధి చెప్పారు. డర్బన్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సఫారీల ఆటగాళ్లను పెవిలియన్ దారి పట్టించారు. దీనిని బట్టి గ్రేమ్ స్మిత్‌కు భారత సత్తా ఏంటో ఈపాటికే అర్థమై ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. శ్రీశాంత్-గ్రేమ్ స్మిత్‌ల వాగ్వివాదంపై సఫారీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హారిస్ మాట్లాడుతూ.. ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఇరు జట్లు పరస్పరం తలపడుతున్నప్పుడు పోరాడాలే తప్ప దూషణలెందుకని చెప్పాడు. అయితే శ్రీశాంత్ హద్దుమీరి ప్రవర్తించడంతోనే మైదానంలో గ్రేమ్ స్మిత్ అలా ప్రవర్తించి ఉంటాడని అన్నాడు.

శ్రీశాంత్ ప్రవర్తనతో స్మిత్ నొచ్చుకొని ఉండొచ్చునని, కానీ శ్రీశాంత్‌కిది మంచి పద్ధతి కాదని హారిస్ అన్నాడు. అయితే కెప్టెన్ ధోనీ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. గ్రేమ్ స్మిత్ విషయంలో శ్రీశాంత్ హద్దుమీరాడనుకోవడం లేదని కెప్టెన్ స్పష్టం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన శ్రీశాంత్ ఒక బౌలర్‌గా ఎప్పుడూ క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రదర్శించలేదన్నాడు. పరిధిని దాటనంత వరకు దాన్ని ‘తీవ్రత’గా పరిగణించాల్సిన అవసరం లేదన్నాడు.

ఇకపోతే డర్బన్ నాలుగో రోజు ఆటలోని కొన్ని విశేషాలను పరిశీలిస్తే..
1. జహీర్ ఖాన్, హర్భజన్‌లిద్దరూ ఈ ఏడాది భారత్ తరపున అత్యధిక వికెట్లను సాధించారు. జహీర్ 21.97 సగటుతో 47, భజ్జీ 40.69 సగటుతో 43 వికెట్లు పడగొట్టారు.
2. లక్ష్మణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకోవడం ఇది ఐదోసారి. కాగా, సఫారీలపై మొదటిది
3. దక్షిణాఫ్రికాతో ఇంటాబయటా 26 టెస్టులాడిన మహేంద్ర సింగ్ ధోనీసేనకు ఇది ఓవరాల్‌గా ఏడో విజయం. ఇక సఫారీ గడ్డపై భారత్‌కిది రెండో టెస్ట్ విజయం. 2006-07లో జొహాన్స్‌ బర్గ్‌లో భారత్ 123 పరుగులతో గెలుపొందింది.
4. ఈ ఏడాది భారత్ మొత్తం 14 టెస్టులు ఆడగా.. అందులో ఎనిమిది విజయాలు, మూడు ఓటములు, మూడు డ్రాలు నమోదు చేసింది.
5. ఈ సంవత్సరం ఎక్కువ విజయాలు సాధించిన జట్లలో ఇంగ్లండ్ (14 టెస్టుల్లో 9 విజయాలు) ఒక్కటే టీమిండియా కంటే ముందంజలో ఉంది.

వెబ్దునియా పై చదవండి