దక్షిణాఫ్రికా జట్టు 1 పరుగులో వరల్డ్‌కప్ మిస్ అయిందని మీకు తెలుసా?
శనివారం, 1 జూన్ 2019 (11:42 IST)
ప్రపంచ క్రికెట్‌లో సౌతాఫ్రికా జట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. జట్టులో ఆటగాళ్లు స్థాయికి మించి రాణిస్తారు. బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్‌లలో వారికి సాటి ఎవరూ లేరు. ఎంతో కష్టపడి ఆడే ఆ జట్టుకు వరల్డ్‌కప్ సాధించడం సింహస్వప్నంగా మారిందనే చెప్పాలి. సెమీఫైనల్ వరకూ ఎలాగైనా వెళ్లే ఆ జట్టుకు అక్కడ బ్రేక్ పడిన సందర్భాలు అనేకమనే చెప్పాలి. ఇలాంటి సంఘటన 1999 వరల్డ్‌కప్ పోటీలలో జరిగింది.
అది జూన్ 17, 1999వ సంవత్సరం. ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా మధ్య రెండవ సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌లో విజయం సాధించిన వారు నేరుగా ఫైనల్‌కి వెళ్తారు. ఇరు జట్లలో హేమాహేమీ ఆటగాళ్లు ఉన్నారు.
నరాలు తెగే ఉత్కంఠగా మ్యాచ్ జరిగింది. ఫలితం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటివరకూ లీగ్ మ్యాచ్‌లలో, సూపర్ ఎయిట్‌లో ఎదురులేకుండా దుసుకుపోతున్న సౌతాఫ్రికా జట్టు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యమైన ఫలితంతో వరల్డ్‌కప్ మిస్సయిందనే చెప్పాలి. ఆ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌లో విజయం సాధించి వరల్డ్‌కప్ ఎగరేసుకుపోయింది.
ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 213 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు కూడా సరిగ్గా 213 పరుగులు చేసింది. గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బ్యాట్స్‌మెన్‌ల మధ్య అవగాహనరాహిత్యం కారణంగా ఓ బ్యాట్స్‌మెన్ అనవసరంగా రనౌట్ అయ్యాడు. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు ల్యాన్స్ క్లూస్‌నర్ రూపంలో ఆల్‌రౌండర్ బ్యాటింగ్ చేస్తున్నాడు, మరోవైపు నాన్-స్ట్రయికర్ ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌గా అలెన్ డొనాల్డ్ ఉన్నాడు.
సరిగ్గా మూడు బంతులకు రెండు పరుగులు చేయాల్సిన పక్షంలో అలెన్ డొనాల్డ్ అనవసర పరుగుకి ప్రయత్నించి అవుటయ్యాడు. అంతటితో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే నిర్వాహకులు మాత్రం రన్‌రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు ఫైనల్‌కి వెళ్లినట్లు ప్రకటించారు. దాంతో ఎంతో కష్టపడుతూ సెమీఫైనల్‌కి చేరుకున్న జట్టు అనూహ్యంగా మ్యాచ్ ఫలితంతో బాగా నిరాశ చెందింది.
ఆ మ్యాచ్ ఫలితాన్ని అప్పటి ఆటగాళ్లు జీర్ణించుకోవడానికి చాలా కాలం పట్టింది. ఇప్పటికీ వారు ఆ మ్యాచ్‌ని గుర్తుచేసుకుంటారంటే అది ఎంతలా వారి మనస్సుల్లో నిలిచి ఉందో మనకు ఇట్టే అర్థం అవుతుంది.