తన ముందే బైక్‌పై తిరుగుతుందనీ ప్రియురాలి ఇంటి వద్ద ప్రియుడి ఆత్మహత్యాయత్నం

సోమవారం, 20 మార్చి 2023 (15:21 IST)
తాను గాఢంగా ప్రేమించిన యువతి తన ముందే బైకుపై తిరగడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. తీవ్ర మనస్తాపం చెందిన ఆ ప్రియుడు.. తన ప్రియురాలి ఇంటి వద్ద ఆత్మహత్యకు యత్నించి కలకలం రేపాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మార్వాడి గుడి సమీపంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గుడివాడ పట్టణంలోని మార్వాడీ గుడి సమీపంలో నివాసం ఉండే బవర్‌ సింగ్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తేనీరు దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని రెండో కుమారుడు శైలేష్‌సింగ్‌(26) పట్టణానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు. అతను ప్రేమించిన యువతి ఇటీవల ద్విచక్రవాహనం కొనుక్కొని చక్కర్లు కొట్టడం శైలేష్‌సింగ్‌కు నచ్చలేదు. 
 
ఈ విషయాన్ని ఆమెకు చెప్పినా వినకపోవడంతో మనస్తాపం చెందిన అతను ఆదివారం సాయంత్రం తన ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లి నువ్వు పదే పదే ద్విచక్రవాహనంపై తిరిగితే నేను చనిపోతానని యువతిని బెదిరించాడు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని ఆమె బదిలివ్వడంతో మనస్తాపానికి గురైన శైలేష్‌సింగ్‌ ప్రియురాలి ఇంటిపైన నివాసం ఉండే వారి ఇంటి వద్దకు వెళ్లి శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. 
 
దీన్ని గమనించిన స్థానికులు అతన్ని 108 సాయంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా శరీరం కాలిపోయిన శైలేష్‌సింగ్‌ పరిస్థితి విషమించంతో న్యాయమూర్తి అతని నుంచి మరణ వాంగ్మూలం సేకరించారు. మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు