ఇటీవల బెంగుళూరు నగరంలో ఆత్మహత్య చేసుకున్న మోడల్ విద్యాశ్రీ రాసిన సూసైడ్ లేఖతో పాటుప డైరీ ఒకటి వెలుగు చూసింది. మీరెవ్వరూ ప్రేమంటూ వెంటపడితే ఎవరినీ నమ్మొద్దు అంటూ యువతకు ఆమె హితవు పలికారు. బెంగుళూరుకు చెందిన విద్యాశ్రీ (25) అనే యువతి మోడల్‌గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆమె ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనుక దాగున్న నిజాలు తెలుసుకుని తల్లిదండ్రులతో పాటు పోలీసులు సైతం నివ్వెర పోతున్నారు. దీంతో విద్యాశ్రీ ఆత్మహత్యకు ప్రధానకారణమైన ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.
బెంగుళూరు నగరానికి చెందిన ఎంసీఏ పూర్తి చేసిన విద్యాశ్రీ ఒక కంపెనీలో ఉద్యోగినిగా పనిచేసేది. మోడలింగ్ ఆమె ప్రవృత్తి. బసవేశ్వరనగరలో ఒక జిమ్‌లో అక్షయ్ (27) ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అతనితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమె నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. ఆమె కూడా అతనే తన సర్వస్వం అని నమ్మి... లక్షలాది రూపాయలను ఖర్చు చేసింది. అతనికే తన జీవితాన్ని అంకింతం చేసింది.
అయితే అక్షయ్.. మనసు మార్చుకుని వివాహం చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో ఆమె జీవితం సుడిగుండంలో చిక్కుకునిపోయింది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడింది. ఇక జీవితమే లేదని భావించి.. గత నెల 21వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె ఆత్మహత్యకు ముందు రాసిన ఓ లేఖ గురువారం వెలుగు చూడటంతో తల్లిదండ్రులు ఠాణా మెట్లెక్కారు. ఆ లేఖ ఆధారంగా పోలీసులు విచారణ పూర్తి చేసి నిందితుడిని అరెస్టు చేసి, విచారణ చేపట్టారు. అక్షయ్‌ను అరెస్టుచేశారు.
అలాగే, విద్యాశ్రీ రాసిన లేఖలోని అంశాలను చదివితే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించుకునిపోతుంది. 'నేను అక్షయ్‌ను ఎంతగానో నమ్మాను. నా జీవితాన్నే ఆయనకు ధారపోశా. ప్రేమను నమ్మి నేను నిండా మునిగా. అందుకే ఇక తనువు చాలిస్తున్నా. మీరెవ్వరూ.. ప్రేమంటూ వెంటపడితే ఎవరనీ నమ్మొద్దు' అంటూ ఆమె రాసింది.