భర్తను వదిలేసిన ఆమె.. భార్యను వదిలేసిన ఆయన.. కర్నూలులో ప్రేమికుల ఆత్మహత్య

ఠాగూర్

ఆదివారం, 12 అక్టోబరు 2025 (15:42 IST)
భర్తను వదిలేసిన ఓ వివాహిత, భార్యను వదిలేసిన ఓ వివాహితుడు.. ఈ ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనుంజయ్ గౌడ్ (27), అదే గ్రామానికి చెందిన శశికళ ప్రేమించుకున్నారు. అయితే, శశికళ వయసు ఎక్కువ కావడంతో వారి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. 
 
ఆ తర్వాత తమ కుటుంబ సభ్యులు కుదుర్చిన వారిని పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. ఆ తర్వాత కూడా వారి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ వచ్చింది. ఇది ఇరువురి కుటుంబాల్లో చిచ్చురేపింది. ధనుంజయ్ భార్య... భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న శశికళ తన భర్తను వదిలేసింది. ఆ తర్వాత ఎమ్మిగనూరులో మెడికల్ షాపు నడుపుతున్న తన ప్రియుడు ధనుంజయ్ గౌడ్ వద్దకు చేరుకుంది. 
 
అక్కడ ఆమెను ధనుంజయ్ ఓ హాస్టల్‌లో ఉంచాడు. అయితే, హాస్టల్‌లో ఉండలేకపోతున్నానని, పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలని శశికళ తన ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. పైగా, ధనుంజయ్‌ను బెదిరించేందుకు ఉత్తుత్తి ఉరి నాటకమాడింది. చీరతో ఉరి వేసుకుంటున్నట్టుగా సెల్ఫీ తీసి తన ప్రియుడుకి పంపించింది. ఆమె చనిపోతే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడిన ధనుంజయ్ గౌడ్.. పురుగుల మందు సేవించాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన కొందరు స్థానికులు ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే, తాను చేసిన చిన్న తప్పువల్ల తన ప్రియుడు చనిపోవడాన్ని తట్టుకోలేకపోయిన శశికళ కూడా పురుగుల మందు సేవించింది. ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చగా అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొంది ప్రాణాలు కోల్పోయింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో ప్రేమికులు చనిపోవడం గువ్వలదొడ్డిలో విషాదం నెలకొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు