అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు... ఆపై లైటర్‌తో నిప్పంటించారు..

ఠాగూర్

ఆదివారం, 24 ఆగస్టు 2025 (18:02 IST)
అమ్మ మీద ఏదో పోశారు.. చెంప మీద కొట్టారు.. ఆ తర్వాత లైటర్‌ను వెలిగించి నిప్పంటించారుఅని ఓ ఆరేళ్ల చిన్నారి చెబుతున్న మాటలు ఇపుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రలోని గ్రేటర్ నోయిడాలో ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తుంది. పైగా, ఓ వివాహిత పట్ల కట్టుకున్న భర్తతో సహా ఆ ఇంటి ఇల్లిపాది ఎంత కిరాతకంగా నడుచుకున్నారో నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. కట్నం కోసం కన్న కొడుకు, సోదరి చూస్తుండగానే నిక్కీ (30) అనే మహిళను ఆమె అత్తింటివారు సజీవదహనం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
 
నిక్కీని ఆమె భర్త విపిన్, అత్తింటివారు కొంతకాలంగా కట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నారు. వారి వేధింపులకు తలొగ్గి నిక్కీ కుటుంబ సభ్యులు మొదట స్కార్పియో కారు, ఆ తర్వాత బుల్లెట్ మోటారై సైకిల్ ఇచ్చారు. అయినా వారి కక్కుర్తి తీరలేదు. ఇటీవల నిక్కీ తండ్రి కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ కారుపై వారి కన్ను పడింది. దానిని కూడా తమకే ఇవ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు.
 
ఈ క్రమంలోనే నిక్కీపై దాడి చేసి, జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి, ఆమెపై కిరోసిన్ లాంటి ద్రావణం పోసి నిప్పంటించారు. ఈ దారుణమంతా ఆమె ఆరేళ్ల కుమారుడు, అదే ఇంట్లో ఉంటున్న ఆమె సోదరి కళ్ల ముందే జరిగింది. నిక్కీ సోదరి కాంచన్ మాట్లాడుతూ రూ.36 లక్షల కట్నం ఇవ్వలేదన్న కోపంతోనే తన సోదరిని భర్త, అత్తింటివారు కలిసి హత్య చేశారని ఆరోపించారు.
 
ఈ ఘటనపై బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "వారు అడిగినవన్నీ ఇచ్చాం. అయినా నా కూతురిని వేధించి చంపేశారు. యోగి ప్రభుత్వంలో ఇలాంటి వారికి చోటులేదు. నిందితులను ఎన్‌కౌంటర్ చేసి, వారి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేం నిరాహార దీక్షకు దిగుతాం" అని హెచ్చరించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి భర్త విపిన్ను పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు అత్త, మామ, నిక్కీ సోదరి భర్తతో సహా మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు