పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలకు టీచర్ వేధింపులు

ఠాగూర్

గురువారం, 16 అక్టోబరు 2025 (09:59 IST)
పోటీ పరీక్షల్లో సెక్స్‌కు సంబంధించిన మార్కులు కూడా వస్తాయంటూ... విద్యార్థినిలను ఓ టీచర్ లైంగికంగా వేధించారు. వారితో చాటింగ్ చేస్తూ లైంగికంగా వేధిస్తూ వచ్చిన ఓ కాలేజీ టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. ఎర్రగడ్డ జనప్రియ అపార్టుమెంటులో నివసించే కాలువ శ్రీకాంత్ (30) అనే వ్యక్తి స్థానిక ప్రైవేట్ కళాశాలలో రెండేళ్లుగా గణితశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కళాశాల సమయం ముగిసిన తర్వాత, ఇంటర్ చదువుతున్న కొందరు విద్యార్థినులకు పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాడు.
 
ఈ క్రమంలో విద్యార్థినుల ఫోన్ నంబర్లు సంపాదించి, ఇంటికి వెళ్లాక వారితో చాటింగ్ చేయడం ప్రారంభించాడు. ముఖ్యంగా ఎన్డీఏ వంటి పరీక్షల్లో శృంగారానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని వారిని తప్పుదోవ పట్టించాడు. వాటి గురించి వివరిస్తాననే నెపంతో అసభ్యకరంగా మాట్లాడటం, చనువు పెంచుకుని లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు.
 
అతని వేధింపులు భరించలేని ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, అధ్యాపకుడు శ్రీకాంత్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
దర్యాప్తులో మరికొందరు విద్యార్థినుల పట్ల కూడా అతను ఇలాగే ప్రవర్తించినట్లు తేలింది. దీంతో పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. గురువు స్థానంలో ఉన్న వ్యక్తే ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు