హైదరాబాద్ నగరంలోని బాలా నగర్‌లో తీవ్ర విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. కవల పిల్లలను చంపేసిన కన్నతల్లి.. చివరకు ఆమె కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఆ మహిళ ఈ దారుణానికి పాల్పడివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
బాలా నగర్‌లోని పద్మారావు నగర్ ఫేజ్-1లో చల్లారి అనిల్ కుమార్, సాయిలక్ష్మి (27) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల వయసున్న కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత వల్లి ఉన్నారు. గత కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన సాయిలక్ష్మి, తన ఇద్దరు పిల్లలను చంపివేసింది. ఆ తర్వాత తాను నివసిస్తున్న భవనంపైకి ఎక్కి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది.
ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో గమనించిన స్థానికులు రక్తపు మడుగులో పడివున్న సాయిలక్ష్మిని చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంట్లో విగతజీవులుగా పడివున్న చిన్నారులను చూసి చలించిపోయారు. మూడు మృతదేహాలను పంచనామా నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కటుంబ వివాదాలే ఈ దారుణానికి కారణమై ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.