ఇద్దరు బిడ్డలు వైద్యులు.. కానీ భర్త శవానికి ఇంట్లోనే భార్య అంత్యక్రియలు

మంగళవారం, 30 మే 2023 (14:52 IST)
తమ ఇద్దరు పిల్లలు వైద్యులు. ఒకరు కర్నూలులో, మరొకరు కెనడాలో స్థిరపడ్డారు. కానీ, తమ తల్లిదండ్రుల బాగోగులను ఆ బిడ్డలు పట్టించుకోలేదు. దీనికితోడు తన భర్తకు పక్షవాతం రావడంతో కట్టుకున్న భార్య కుంగిపోయింది. ఆయన సపర్యలు చేస్తూ జీవచ్ఛవంలా బతుకుతోంది. అయితే, అనారోగ్యంతో భర్త కూడా సోమవారం చనిపోయాడు. దీంతో ఏం చేయాలో తోచక... ఇంట్లోనే భర్తకు అంత్యక్రియలు పూర్తిచేసింది. ఇంట్లో ఉన్న అట్టపెట్టెలు, పుస్తకాలను చితిగా పేర్చి భర్త హరికృష్ణ ప్రసాద్‌కు దహన సంస్కారాలు నిర్వహించింది. 
 
ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని కర్నూలు జిల్లా పత్తికొండ పాతపేటలో జరిగింది. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, హరికృష్ణ ప్రసాద్, లలిత దంపతులకు 30 యేళ్ల క్రితం వివాహమైంది. వీరికి దినేష్, ముఖేష్ అనే ఇద్దరు కుమారులు, ఒకరు కర్నూలులో, మరొకరు కెనడాలో వైద్యులుగా స్థిరపడ్డారు. పక్షవాతంతో భర్త మంచానికే పరిమితమయ్యాడు. కొడుకులు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడంతో భర్తకు సేవలు చేస్తూ లలిత తీవ్ర మనోవేదనకు గురైంది. 
 
ఈ క్రమంలో భర్త అనారోగ్యంతో చనిపోయాడు. తనకు ఎవరూ సాయం చేసేవారు లేకపోవడంతో ఇంట్లోనే దహన సంస్కారాలు చేసేసింది. ఈ విషయాన్ని కుమారులకు ఫోన్ చేసి చెప్పింది. కెనడాలో ఉన్న కుమారుడు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దాదాపు కాలిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై లలితన విచారిస్తున్నారు. పోస్టుమార్టం వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు