తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం భార్యను చిత్ర హింసలకు గురిచేశారు. గృహంలో నిర్బంధించి, అన్నపానీయాలు పెట్టకుండా అస్థిపంజరంలా మార్చి హత్య చేశాడో కిరాతక భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా కల్లూరు మండల విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్న (33)కు ఖాన్ ఖాన్ పేట గ్రామ వాసి పూల నరేష్ బాబుకు గత 2015లో వివాహం జరిగరింది. గత మూడేళ్లుగా వారు అశ్వారావుపేటలో నివాసం ఉంటుందన్నారు.
శనివారం తన భార్య లక్ష్మీప్రసన్న మెట్లపై నుంచి జారిపడటంతో గాయమైందని చెబుతూ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పైగా అత్తా మామలకు ఫోన్ చేసి చెప్పాడు. ఈలోపు లక్ష్మీ ప్రసన్న ఆస్పత్రిలో చనిపోయింది. ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులు తమ కుమార్తె ఉన్న పరిస్థితిని చూసి కుప్పకూలిపోయారు. తమ కుమార్తె గుర్తుపట్టలేని స్థితిలో ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె శరీరంపై కొత్త గాయాలతో పాటు పాత గాయాలు ఆనవాళ్లు కూడా ఉండటంతో వారికి అనుమానం వచ్చింది.
రెండేళ్ళుగా తమ కుమార్తెను ఒక గదిలో బంధించి కనీసం తమతో కూడా మాట్లాడనివ్వలేదని లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదనపు కట్నం కోసమే నరేష్ ఇంత కిరాతకంగా ప్రవర్తించాడని వారు మండిపడుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్తను పోలీసులు అరెస్టు చేశారు.