ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. కాయగూరలు అమ్ముకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒంటరిగా ద్విచక్రవాహనంపై వెళుతుండగా ఆమెను వెంబడించి, వాహనంతో ఢీకొట్టించి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణం జిల్లాలోని ఒంగోలు మండలం, కొప్పోలు - గుత్తికొండవారిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది.
నిర్మానుష్య ప్రాంతంలో ఆమె వాహనాన్ని ఢీకొట్టి, మహిళను పక్కనున్న పొదల్లోకి లాక్కెళ్లారు. ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించినా వదల్లేదు. అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఆలస్యమవుతున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను వెతుక్కుంటూ వచ్చారు.
దీనిపై బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు, తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి బాధితురాలిని విచారించి వివరాలు సేకరించారు. సంఘటన స్థలానికి గురువారం చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించారు. కొప్పోలు గ్రామంలో చేపల చెరువు వద్ద కాపలాగా ఉన్న ఇద్దరు వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.