సొంత తమ్ముడిని దారుణంగా కొట్టి చంపేసిన అన్న.. ఎక్కడ?
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో ఒక దారుణం జరిగింది. సొంత తమ్ముడినే దారుణంగా కొట్టి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తన వాటాగా వచ్చిన స్థలాన్ని తమ్ముడు అమ్ముకునేందుకు ప్రయత్నించడాన్ని జీర్ణించుకోలేని అన్న ఈ దారుణానికి తెగబడ్డాడు. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మేరకు...
40వ డివిజన్ ఉర్సు తాళ్లమండువ ప్రాంతానికి చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురు అన్నదమ్ములు ఉండగా, వీరంతా తమ తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్దవాడైన శ్రీనివాస్ మరణించగా, చిన్నవాడైన శ్రీకాంత్‌కు వచ్చిన వాటా విషయంలో గొడవపడిన అన్న శ్రీధర్, ఆ భూమి నీకు ఇవ్వనని, ఇక్కడుంటే చంపుతానని బెదిరించడమే కాకుండా అంతపని చేశాడు.
దాంతో శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలిసి నిజామాబాద్‌కు వెళ్లి కూలి పనిచేసుకుంటూ ఉంటున్నాడు. 2019లో అక్కడి అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కరోనా తర్వాత అనారోగ్య సమస్యలతో తనకు చెందిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు.
అదేవిషయంపై నిజామాబాద్ నుంచి ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి యత్నించగా సోదరుడు శ్రీధర్ ఎప్పటిలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఈనెల 7న మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో సోదరుడిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు శ్రీధర్‌ను స్టేషన్ పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వగా, తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని నమ్మబలికాడు.
భూమిని అమ్మడానికి ఇబ్బందిలేదని నమ్మిన శ్రీకాంత్ భార్యతో కలసి వరంగల్‌కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ.. స్థలాన్ని విక్రయించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. శనివారం ఎప్పటిలాగే ఇద్దరు కొనుగోలుదారులను వెంట తీసుకొని స్థలం వద్దకు వెళ్లగా, వెనుక నుంచి వచ్చిన శ్రీధర్ తమ్ముడు శ్రీకాంత్‌ను కొట్టడంతో స్థలం చూసేందుకు వచ్చిన వారు పారిపోయారు.
సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీకాంత్‌ను కొడుతున్నా స్థానికంగా ఉన్న వారెవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత శ్రీకాంత్‌ను ఇంట్లోకి తీసుకెళ్లి గాయపరిచి అతనిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. తలుపు వద్ద బండరాయి అడ్డుగా పెట్టాడు. ఎలాగోలా శ్రీకాంత్ ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తగా, బజారులో అందరూ చూస్తుండగానే రాయితో కొట్టి హత్యచేసినట్లు స్థానికులు తెలిపారు.
శ్రీధర్, అతని భార్యాపిల్లలు ఇల్లు వదిలి పారిపోయారు. సంఘటన స్థలానికి ఏసీపీ బోనాల కిషన్, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్ చేరుకుని పోలీసు జాగిలాలతో దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు సీఐ పేర్కొన్నారు.