తెలంగాణ రాష్ట్రంలోని కోటపల్లి మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా నడుచుకున్నాడు. దీంతో బాలికలు తమ తల్లిదండ్రులు, కుటుబ సభ్యులతో కలిసి హెచ్ఎంకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పైగా, వేధింపుల విషయం బయటకు చెబితే టీసీ ఇచ్చి స్కూలు నుంచి పంపించే వేస్తామంటూ హెచ్ఎం బెదిరిస్తున్నారని బాధిత బాలికలు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
పాఠశాల హెచ్ఎం అసభ్యకరంగా మాట్లాడుతూ తమను ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. వసతి గృహంలో సరైన భోజనం పెట్టడం లేదని, ఈ విషయంపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. రెండు రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా, హెచ్ఎం తమను బుజ్జగించి తిరిగి పాఠశాలకు పంపించారని తెలిపారు.
ఈ సమస్యపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడం వల్లే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని విద్యార్థినులు పేర్కొన్నారు. బాలికల పాఠశాలలో మహిళా హెచ్ఎంను నియమిస్తే తమకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని, వెంటనే ప్రస్తుత హెచ్ఎంను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, విద్యార్థినులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.