విశాఖపట్టణంలోని ఫార్మాసిటీలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని నగ్నంగా వీడియో తీసిన ఓ యువకుడు అంతలోనే శవమయ్యాడు. యువకుడిని గదిలో నిర్బంధించి అతని తల్లిదండ్రులకు కబురు పెట్టారు. తల్లిదండ్రులు వస్తే తన పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. కేబుల్ వైరుతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు..
విజయనగరం జిల్లా ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన గొందేటి భాస్కర రావు (30) అనే వ్యక్తి విశాఖ ఫార్మాసిటీలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన గాజువాక సమీపంలోని శ్రీరాంనగర్‌లో ఓ ఇంటిలో అద్దెకు ఉంటున్నాడు. శనివారం ఉదయం పక్కింటి అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు భాస్కర రావుతో గొడవకు దిగి, వీడియోను డిలీట్ చేయించారు.
అయితే, అంతటితో వారు ఆగకుండా భాస్కర రావును ఇంట్లోనే బంధించి, విజయనగరంలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత గదిలోకి వెళ్లి చూసి హతాశులయ్యారు. సీలింగ్ ఫ్యానుకు కేబుల్ వైరుతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డ ముఖంపై గాయాలు కూడా ఉన్నాయని, తమ కుమారుడుని కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.