అన్నాడిఎంకే పార్టీలో ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి. అస్సలు పార్టీలో ఉన్న వారి కన్నా పార్టీ నుంచి వెళ్ళిపోయి బయటక ఉన్న వారే ఎక్కువగా నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అన్నాడిఎంకేకు ముఖ్యమంత్రిగా పళణిస్వామి ఉన్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారన్నది అందరికీ తెలిసిందే. జైలులో ఉన్న శశికళ కనుసన్నల్లోనే తమిళ ప్రభుత్వం నడుస్తోందనేది కూడా తెలిసిందే.
తన మేనల్లుడు దినకరన్ ద్వారా అన్నడిఎంకేను నడిపాలనుకుని చివరకు బొక్కబోర్లాపడిన శశికళ ఇప్పుడు మళ్ళీ అదే ప్రయ్నతం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఎరచూపి అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్ళి ఎలాగోలా బెయిల్‌పై బయటకు వచ్చిన దినకరన్ మళ్ళీ అన్నాడిఎంకే పార్టీపైన పడ్డారు. శశికళ తీసుకొన్న నిర్ణయాలంటూ కొంతమందికి పదవులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రెండురోజుల క్రితం పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేశారు దినకరన్. మొత్తం 60 మందిని పదవుల్లో నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పార్టీలో పదవులు రావడంతో 57మంది ఆనందాన్ని వ్యక్తం చేయగా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం నువ్వేంటి మాకు పదవులు ఇచ్చేది... అస్సలు నువ్వెవరంటూ ఎదురుతిరిగారు. అన్నాడిఎంకే పార్టీలోని ముగ్గురు ఎమ్మెల్యేలు సత్య, బోస్, పళణిలు పదవులు వద్దంటూ తిరస్కరించారు. వీరే కాదు ఏకంగా ఆర్థికమంత్రి జయకుమార్ దినకరన్ నియామకాలను తప్పుబట్టారు.
ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై కోర్టుగాని, ఎన్నికల కమిషన్ గాని తేల్చకుండా శశికళ చెప్పిందంటూ దినకరన్ పార్టీ పదవులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పదవులు మాకేం అవసరం లేదని..ఆ పదవులు మడిచి...అక్కడ పెట్టుకో అంటూ ఎమ్మెల్యేలు బూతుల పురాణం మొదలెట్టారట. దీన్ని బట్టి శశికళ, దినకరన్ లపై అన్నాడిఎంకేలోని కొంతమంది నేతల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది.