బాబు చుట్టూ బిగుస్తున్న సీబీఐ ఉచ్చు? 'దేవధరా'... ఇదేనా మీ మాటల మర్మం!

బుధవారం, 17 జులై 2019 (15:43 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చుట్టూ సీబీఐ ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు. కేంద్రం ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోవైపు వడివడిగా నిశ్శబ్దపు అడుగులు పడుతున్నాయి. ఇటీవల వలస వచ్చిన అటు భాజపా, ఇటు వైకాపా వలస నేతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలకు రంగం సిద్దమౌవుతోంది. 
 
పార్లమెంటులో అలా..: 
పోలవరం విషయంలో ఎన్నో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు రాద్దాంతం చేశారు. సోమవారం పార్లమెంటులో వైసీపీనేత విజయ సాయిరెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానమిస్తూ…'పోలవరం ప్రాజెక్టుపై అక్రమాలు ఏమీ లేవు. అవకతవకలపై ఏ నివేదికలూ లేవు. అందుకని సీబీఐ విచారణఅనే ప్రశ్నే ఉత్పన్నం కాదు' అంటూ సమాధానమిచ్చారు. 
 
అంటే... ప్రస్తుతానికి ఏ నివేదికలూ లేవు కాబట్టి అక్రమాలు లేనట్టుగా లెక్క. ఒకవేళ అక్రమాలపై ఏవైనా పరిగణనలోకి తీసుకోదగిన నివేదికలు వస్తే, అప్పుడు కదా సీబీఐ కేసు, విచారణ అని పరోక్షంగా చెబుతున్నారు సదరు కేంద్రమంత్రి. అంతేకాదు, 'ఏమైనా నివేదికలు వస్తే చూస్తాం' అని ఓ కేంద్ర మంత్రి హోదాలో ఉప్పందించారు. ఎంతైనా కమలనాథులు గదా..! ఆరూటే సపరేటు. 
 
ఆంధ్ర అసెంబ్లీలో ఇలా...: 
బాబుపైకి సీబీఐ..? దర్యాప్తుకు జగన్ దాదాపుగా రూట్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఈ ప్రస్థావన సమయంలోనే సరిగ్గా ఈ దశలో పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఓ నిపుణుల కమిటీ ఓ సాధికారిక నివేదికను ఇస్తున్నది. అదీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. అందులో ఎక్కడెక్కడ అక్రమాలు చోటు చేసుకున్నాయో లెక్కలతో సహా ఉన్నయని తెలుస్తోంది. అసెంబ్లీలో రాష్ట్ర సాగునీటి మంత్రి కూడా.. 'అసలు ఈపీసీ కింద ఇచ్చిన ఒక కాంట్రాక్టు పనుల్లో కొన్ని విడదీసి, నామినేషన్ పద్ధతిపై వేరే వాళ్లకు ఎలా ఇస్తారు..?' అని తెలుగుదేశం సభ్యుల వైపు చూస్తూ… ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ప్రశ్నించాడు. అంటే, ఇలాంటి చాలా అంశాలపై వేర్వేరు నివేదికలు వాడిగా, వేడిగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
 
ఆ దర్యాప్తే ఎందుకు..?: 
నిపుణుల కమిటీ అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చెల్లింపులు, అంచనాల పెంపు తదితర విషయాలపై అధికారికంగా నమోదైన వివరాలను మాత్రమే చెప్పగలదు. కానీ.. దాని వెనుక బాగోతాల్ని చెప్పలేదు. అది ఎవరు చెప్పాలి..? ఎవరైనా దర్యాప్తు చేసి వెలికి తీయాలి..? అదెవరు చేయాలి..? ఇదే అసలు సిసలైన ప్రశ్న. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దానికి 100 శాతం నిధులిచ్చేది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కొన్ని డబ్బులు వెచ్చించినా, ప్రతి పైసా రీయింబర్స్ చేయాల్సింది కూడా కేంద్రమే. అందుకని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు లేదా విజిలెన్స్ దర్యాప్తు చేసినా అవి అంత లోతుల్లోకి వెళ్తాయా, లేదా అనేది ప్రస్తుత ప్రభుత్వాలకు 'డౌటనుమానం' ఉంది. అందుకని ఇక మిగిలింది కేంద్ర దర్యాప్తు సంస్థలు అనగా సీబీఐ మాత్రమే. 
 
నాటి జీఓ.. నేడు బుట్ట దాఖలు: 
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 'మోడీ ప్రభుత్వం ఎక్కడ తనపై సీబీఐని ప్రయోగిస్తుందో' అని భయపడ్డ తెలుగుదేశం నాయకులు సీబీఐ రాష్ట్ర అంశాల్లో వేలు పెట్టకుండా, విచారణ జరపకుండా ఓ జీవో  ఎం.ఎస్.నెం.176, తేదీ: 8-11-2018న తీసుకొచ్చారు. జగన్ వచ్చాక దాన్ని రద్దు చేసి, తిరిగి సీబీఐకి మార్గం సుగమం చేశాడు. ఇక ఇప్పుడు ఈ నిపుణుల కమిటీ నివేదికతో పాటు సాగునీటి శాఖ అంతర్గత నివేదికల్ని కేంద్రం ముందు పెట్టడమే తరువాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'మా ప్రాథమిక పరిశీలనలో వెల్లడైన అ(కొ)న్ని అక్రమాలు ఇవీ. మీరిచ్చే డబ్బులు ఇలా దుర్వినియోగం అయ్యాయి, మీరే ఇంకా దర్యాప్తు చేసి, నిగ్గు తేల్చి, అక్రమార్కులపై చర్యలు తీసుకోగలరు' అంటూ కేంద్రానికి ఆయా నివేదికలు నిశ్శబ్దంగా అప్పగించి, దుమ్ము అంటని చేతులు దులుపుకుంటూ వినోదం చూడనుంది.
 
'దేవధరా'... ఇదేనా మీ మాటల మర్మం: 
కాగల కార్యం ఇక మోడీ చూసుకుంటాడా..? చంద్రబాబుపై సిబిఐ దర్యాప్తు పోలవరం అక్రమాల నుంచే మొదలెడతారా..? లేక మరో అస్త్రాన్ని బయటకు తీస్తారా..? అన్నది తేలాల్సిఉంది. అందుకే ఈమధ్య బీజేపీ ఏపీ బాధ్యుడు దేవధర్ పదే పదే 'చంద్రబాబు జైలుకు వెళ్తాడు' అని చెబుతున్నది…? ఔరా..! ఏం జరగనుందో మరి…!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు