ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

ఠాగూర్

బుధవారం, 8 జనవరి 2025 (17:49 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. వచ్చే నెల ఐదో తేదీన పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. అయితే, ఈ ఎన్నికలు మూడు పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. ముఖ్యంగా, అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. గత దశాబ్దకాలం క్రితం అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయభేరీ మోగిస్తున్న కమలనాథులు.. దేశ పరిపాలన కేంద్రమైన ఢిల్లీలో మాత్రం అధికారం అందని ద్రాక్షపండులా ఉంది. దీంతో ఈ దఫా ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ కారణంగా ఈ మూడు పార్టీలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 
 
ముఖ్యంగా, కేంద్రంలో మూడుసార్లు బీజేపీ అధికారం చేపట్టినా చిక్కని ఢిల్లీ అసెంబ్లీని దక్కించుకోవడం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ఇపుడు కఠిన పరీక్షగా మారింది. ఇక గతంలో ఏకఛత్రాధిపత్యం వహించిన ఢిల్లీ అసెంబ్లీలో ఉనికిని నిరూపించుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యావశ్యకం. ఢిల్లీలో భాజపా, ఆప్, కాంగ్రెస్ తలపడుతున్నా అసలైన పోటీ భాజపా, ఆప్‌ల మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశముంది.
 
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చిన అగ్ర నేతలతో పార్టీ నైతిక స్థైర్యం దెబ్బతిన్నా ఇప్పటికే ఉచితంగా అందిస్తున్న విద్యుత్తు, తాగునీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాలపై ఆధారపడే ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆప్ సిద్ధమవుతోంది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు, మొహల్లా క్లినిక్‌ల సౌకర్యాన్ని అందరూ అందుకోలేకపోయినా ఈ మూడు పథకాలు ధనిక, పేద అన్న తేడా లేకుండా అందరికీ అందుతుండటంతో అవే తమను మళ్లీ అధికారంలో కూర్చోబెడతాయన్న ఆశ ఆప్ కనిపిస్తోంది. దీనికితోడు ఈ ఎన్నికల్లో గెలిపిస్తే 18ఏళ్ల పైబడిన మహిళలందరికీ ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద నెలకు రూ.2,100 చెల్లిస్తామని హామీ ఇచ్చింది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందిస్తామనీ చెప్పింది.
 
ఢిల్లీలో భాజపా, కాంగ్రెస్ పార్టీలకు స్థానికంగా బలమైన నాయకులు లేకపోవడం కేజ్రీవాల్‌కు కలిసిరానుంది. లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసే భాజపా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి ఘోరంగా ఓడిపోతోంది. 25 ఏళ్లుగా ఆ పార్టీ అధికారం సాధించలేకపోతోంది. స్థానికంగా బలమైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో మోడీ, అమిత్ షాలే అభ్యర్థులుగా ప్రచారం చేయాల్సి వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు