"నంది"నే వద్దన్నాడు.. ఇప్పుడు పవన్ బండెక్కుతారట... జనసేన స్పీడెంతో..?

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:32 IST)
తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత, గుమ్మంలోకి వచ్చిన నంది అవార్డుని ఎంతో తేలిగ్గా తీసిపారేసిన ఫైర్‌బ్రాండ్ గద్దర్ ఇప్పుడు తాజాగా జనసేనవైపు ఆసక్తిగా, ఆశగా చూస్తున్నారు. ఎన్నో పార్టీలకు కేవలం మద్దతు తెలిపి, గొంతు కలిపిన గద్దర్ వామపక్షాలతో కలిసి పని చేస్తాం అనే పవన్ మాటలను ఆసరా చేసుకుని, ఆయనతో కలిసి పని చేస్తానంటూ అప్పుడప్పుడూ మీడియాకు లీకులిస్తూ గడిపారు. పవన్‌‍తో భేటీ అయ్యేందుకు ప్రయత్నించి, అపాయింట్మెంట్ దొరకకపోవడంతో మిన్నకుండిపోయారు. 
 
కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న గద్దర్, మావోయిస్ట్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పటికీ వెనుకబడిన కులాలు, నిమ్నకులాల ఉద్దరణ ఉద్దేశ్యంతో తెలంగాణ ఉద్యమానికి జైకొట్టారు. అంతేకాక ఆయన వ్రాసిన 'అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా' అనే పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా చలామణీలో ఉంది. ఈ విధంగా తెలంగాణ ఉద్యమానికి, విభజనకు తన వంతు మద్దతు తెలియజేసిన గద్దర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారేందుకు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణలో జనసేన పార్టీకి నాయకత్వం వహించేందుకు ఆసక్తిగా ఉన్న గద్దర్‌ను పవన్ ఇంకా కనికరించలేదు. 
 
మరోవైపు రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రకు చేయవలసిన ప్రత్యేక సాయం విషయంలో మొండిచేయి చూపిన మోడీపై ఎక్కువగా ట్విట్టర్‌లో, అప్పుడప్పుడూ జరిగే బహిరంగ సభల్లో నిప్పులు కురిపిస్తున్న పవన్ ఇంకా చంద్రబాబుపై అంతగా ట్విట్టర్ చేసుకోవడం లేదు. స్థానిక నేతలతో ఎప్పుడూ సత్సంబంధాలు నెరపడానికే ప్రాధాన్యం ఇచ్చే పవన్ ఈ మధ్య తెరాసను సైతం ఆకాశానికెత్తడం చూస్తూనే ఉన్నాం. రాజకీయాల పట్ల పవన్ చిత్తశుద్దినే శంకిస్తున్న పరిస్థితుల్లో దేశంలోనే తొలిసారిగా ప్రవేశపరీక్షతో సభ్యత్వం అనే కొత్త విధానానికి తెరతీసిన పవన్ విమర్శకులకు మాత్రం ఇంకా సరైన సమాధానం ఇవ్వలేదు. అసలు ప్రయాణిస్తుందో లేదో తెలియని బస్సులో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు గద్దర్ అనే జోకు రాజకీయ సర్కిళ్లలో వినిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి