చంద్రబాబు కన్నీటి పర్యంతమెందుకయ్యారు? ఏపీ ప్రజలకు జగన్ మంచి చేస్తే అది ఎందుకు ఆవిరైంది?

ఐవీఆర్

మంగళవారం, 4 జూన్ 2024 (22:53 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కోట్లాది మందికి కోట్ల రూపాయల్లో ఆర్థిక సహాయం. నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు, రైతు భరోసా, అమ్మ ఒడి, వాహన మిత్ర... ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో సంక్షేమ పథకాలు. కానీ జనం ఏమి అనుకుంటున్నారు? అది జన నాయకుడిగా పిలుపించుకున్న జగన్ మోహన్ రెడ్డికి చేరిందా? చేరేందుకు ఆయన చుట్టు అడ్డు గోడలు నిర్మించబడ్డాయా? అసలు ప్రజలకు డబ్బు వేస్తే సంతోషంగా వున్నారనీ, సహాయం చేసామని జగన్ అనుకున్నారేమోగానీ ఏపీ ప్రజల్లో ఎవరైనా సమస్యను చెప్పుకునేందుకు, ఆయన ముందుకు ధైర్యంగా వెళ్లేందుకు అవకాశాలు వున్నాయా? ఒకవేళ ఎవరైనా ఆ ప్రయత్నం చేసినా, ప్రభుత్వాన్ని నిలదీసినా వారిని తరిమి తరిమి కొట్టారన్న ఆరోపణలు ఎన్నో వున్నాయి. అలాంటప్పుడు సమస్యను చెప్పుకునే పరిస్థితి ఏదీ...?
 
విశాఖ పట్టణం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి తదితర నగరాల్లో వున్న నగర ప్రజలు, పట్టణ ప్రజలు పెంచిన విద్యుత్ చార్జీలు కట్టలేక, చెత్త పన్ను, ఇంటి పన్ను... ఇలా అన్నీ కలిసి పెరిగిపోయి పర్వతంలా మారిపోతే... ఏవో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికి బండిలాగే బడుగుజీవి ఎంత వ్యధ అనుభవిస్తున్నాడో అడిగేవారేరీ? పల్లెల్లో ఉపాధి లేక ఇటు నగరంలో కనీసం ఓ చిన్న ఇంటిలో వుండే స్థోమత లేక ఫుట్ పాత్ పైనే జీవనం సాగిస్తున్న చిరుజీవి పరిస్థితులను ఎవరైనా చూసారా? జగన్ దృష్టికి ఇవి వెళ్లాయా? అర్హులైనవారు అన్నారే కానీ అందులో అసలైన అర్హులకు అందాయా... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో సమస్యలు ప్రజలను కుంగదీశాయి.
 
వీటికితోడు రాజధాని లేదు. భవన కార్మికులకు పనిలేదు, రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం సేకరించేందుకు అనువైన సమయం ఎప్పుడొస్తుందో తెలియదు... ఈలోపు వారు పంట కోసం తెచ్చిన అప్పులు భారం... రైతు భరోసా వచ్చినా ఆ భారం దిగక మళ్లీ అప్పులు. ఇవన్నీ పల్లెల్లో చాలామంది రైతులు చెప్పిన గోడు. చిరు వ్యాపారులకు వెన్నుదన్ను లేదు. వాటికి తోడు ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను భయభ్రాంతులను చేసాయి.
> ఇవన్నీ అలావుంచితే... గద్దెనెక్కగానే ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న తొలి నిర్ణయం... ప్రజావేదిక కూల్చివేత. ఆరోజు ఆంధ్ర ప్రజలు ఆశ్చర్యపోయారు. అధికారం చేతికిచ్చింది అభివృద్ధి నిర్మాణాలకే కానీ ఇలా కూల్చివేతలకా అని. ఆ తర్వాత తక్కువ సీట్లకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ నాయకులపై దాడులు. చివరికి భారతదేశ చరిత్రలో తెలుగు రాష్ట్రాల నుంచి మేటి నాయకుడిగా పేరున్న చంద్రబాబు నాయుడుని వ్యక్తిగతంగా మంత్రులు దూషించి, దుర్భాషలాడుతుంటే వారిని అదుపు చేసే పరిస్థితి కనిపించకపోవడం... ఆనాడు చంద్రబాబు మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఉద్వేగానికి లోనుకాని బాబు కన్నీటి పర్యంతమవడం చూసిన ఏపీ జనతా ఆరోజే కదిలిపోయింది.

అది చాలక ఇటీవలే చంద్రబాబును స్కిల్ కేసు స్కాం అంటూ రాజమండ్రి జైల్లో పెట్టడంతో తెదేపా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆ దశలో తెదేపా నాయకులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ రాజమండ్రి కేంద్ర కారాగారానికి వెళ్లారు పవన్ కల్యాణ్. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూనే తాము కూటమిగా ఏర్పడి పోటీ చేస్తామని అక్కడికక్కడే ప్రకటించేసారు. తదుపరి వారాహి యాత్ర ఒకవైపు, ప్రజాగళం ఇంకోవైపు కలిసి పవన్-చంద్రబాబులు చేపట్టిన సభలకు జన సునామీ కలిసి రావడంతో వైసిపి ఓటమికి బాటలు పడ్డాయి.
 
ఇన్నాళ్లుగా అదను కోసం చూస్తూ వున్న ప్రజలు ఎన్నికల రావడంతో తమ నిర్ణయాన్ని చెప్పేందుకు నడుం బిగించారు. ఓట్లు వేయడానికి అర్థరాత్రి దాటినా క్యూల్లో బారులు తీరారు. ఏపీ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తూ 82 శాతం పైగా ఓటింగ్ నమోదు చేసారు. ఆరోజే వైసిపి నాయకుల తలరాతను మార్చుతూ ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర, కోస్తాంధ్ర నుంచి రాయలసీమ... ఇలా ప్రాంతాలతో బేధం లేకుండా అందరూ మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నారా... అన్నట్లు వైఎస్ఆర్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసారు. ఇలా గత ఐదేళ్లుగా ఏపీలో జగన్ సర్కార్ హయాంలో జరిగినవే ఆ పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు