ఇందిరా గాంధీ బర్త్‌డే.. అత్యంత వివాదాస్పద నిర్ణయం ఎమర్జెన్సీ
సోమవారం, 19 నవంబరు 2018 (12:20 IST)
ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరా గాంధీ.. దేశ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైనది ఎమర్జెన్సీని (అత్యవసరస్థితి) విధించడం. ఈ నిర్ణయం ఆమె ఏకపక్షంగా తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ఫలితంగా 1975 నుంచి 1977 మధ్యకాలంలో ఆమె 21 నెలలపాటు దేశంలో ఎమెర్జెన్సీ కొనసాగింది.
భారత రాజ్యాంగంలోని 352 (1) అధికరణంలో అంతర్గత కల్లోల స్థితిని ఉద్దేశించి ఏర్పరచిన అంతర్గత అత్యవసర స్థితి మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దేశంలో అత్యవసరస్థితిని విధించాలన్న ఏకపక్ష నిర్ణయం తీసుకుని, దాన్ని అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ద్వారా 1975 జూన్ 25వ తేదీ అర్థరాత్రి 11.45 నిమిషాలకు అధికారికంగా అమల్లోకి తెచ్చారు.
ఈ ఎమర్జెన్సీ 1977 మార్చి 21వ తేదీ వరకు కొనసాగింది. ఈ అత్యవసరస్థితి ఆదేశాల ద్వారా దేశాన్ని పరిపాలిస్తూనే ఎన్నికలను నిలిపివేసి, పౌరహక్కులు అడ్డుకునే అధికారాన్ని ప్రధానమంత్రికి పూర్తి అధికారాలు ఈ ఆర్టికల్ కల్పిస్తుంది.
అయితే, ఈ ఎమర్జెన్సీ సమయంలో ఆమె ప్రజల జోలికి వెళ్లకుండా కేవలం రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, వారిని జైళ్లకు పంపించారు. అలాగే, పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ఈ అత్యవసరస్థితి అమలైన కాలం దేశంలో అత్యంత వివాదాస్పదమైన కాలాల్లో ఒకటిగా చెప్పుకుంటారు.
అయితే, దేశ ప్రజలు ఇప్పటివరకు మూడుసార్లు ఎమర్జెన్సీని చవిచూశారు. తొలిసారి భారత్ - చైనా యుద్ధ సమయంలో అంటే 1962 అక్టోబరు 26వ తేదీన అమలు చేసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
ఆ తర్వాత భారత్ - పాకిస్థాన్ యుద్ధ సమయంలో అంటే 1971 డిసెంబరు 3వ తేదీన విధించారు. అనంతరం దేశంలో చెలరేగిన అంతర్గత అల్లర్లను అదుపు చేసేందుకు నాడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ 1975 జూన్ 25వ తేదీ నుంచి 1977 మార్చి 21వ తేదీ వరకు ఎమర్జెన్సీని విధించారు.
జాతీయ అత్యవసరస్థితిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 కింద ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి లిఖితపూర్వక అభ్యర్థన మేరకు రాష్ట్రపతి విధిస్తారు. దాన్ని పార్లమెంట్ ఆమోదానికి నివేదించాలి. జాతీయ అవసరపరిస్థితిలో ప్రజల ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా రద్దు చేస్తారు. అలాంటి ఇందిరా గాంధీ పుట్టిన రోజు నేడు (1917 నవంబరు 19వ తేదీ) కావడం గమనార్హం.