ఆగస్టు 26.. అంతర్జాతీయ శునక దినోత్సవం.. అత్యంత విశ్వసనీయమైనది కుక్క

శుక్రవారం, 26 ఆగస్టు 2022 (10:03 IST)
ప్రతి యేటా ఆగస్టు 26వ తేదీన అంతర్జాతీయ శునకాల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ దినోత్సవం గత 2004 నుంచి ప్రారంభమైంది. రెస్క్యూ డాగ్స్‌కు సురక్షితమై, వాత్సల్య వాతావరణం అందించాలన్న ఏకైక లక్ష్యంతోనూ, శునకాల ప్రాధాన్యతను అందరికీ చాటిచెప్పాలన్న ఏకైక లక్ష్యం, వాటి దత్తత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతియేటా ఆగస్టు 26వ తేదీని ఇంటర్నేషనల్ డాగ్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 
 
గత 2004లో కొలీన్ ఫైజ్ అనే ఒక రచయిత ఈ శునకాల దినోత్సవాన్ని జరుపుకునేందుకు విత్తు నాటారు. జంతు సంక్షేమ న్యాయవాది అయిన ఆయన నేషనల్ డాగ్ డే, నేషనల్ పెట్ డే, నేషనల్ పప్సీ డే కోసం ఎంతగానో కృషి చేశారు. నిజానికి శునాకికి ఓ పిడికెడు అన్నం ముద్ద వేస్తే అది జీవితాన్ని విశ్వాసంగా ఉంటుందని ప్రతి ఒక్కరి ప్రగాఢ విశ్వాసం. 
 
పైగా, కుక్కను గ్రామ సింహంతో పోల్చుతారు. అంటే. అడవికి సింహం ఎలాగో, గ్రామానికి శునకం ఆవిధంగా. గ్రామంలోని వేరే ఊరి మనిషి వచ్చినా, రాత్రి సమయాల్లో దొంగలు వచ్చినా కుక్కలు బౌ బౌ అంటు బిగ్గరగా అరుస్తాయి. ముఖ్యంగా, అనేక కేసుల చిక్కు ముడుల్లో శునకాలు పోలీసులకు ఎంతగానో సాయపడుతున్నాయి. 
 
అలాంటి కుక్కలను అనేక మంది హేళన చేస్తున్నారు. నిజానికి కుక్క వల్ల కలిగే లాభాలను తెలిస్తే వీధి కుక్కలను ఏ ఒక్కరూ ఛీదరించుకోరు. తాజాగా కూడా ఓ పెంపుడు కుక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యతను వివరిస్తూ "777 చార్లీ" అనే సినిమా కూడా వచ్చింది. శునకాలను ఎంతగానో అభిమానించేవారికి ఈ చిత్రం ఎంతగానో నచ్చింది. 
 
వాస్తవానికి శునకాలకు మంచి చెడు అంటూ ఏమీ తెలియదు. వాటిని ప్రేమిస్తే అవి మనకు విశ్వాసంగా ఉంటాయి. అందుకే కుక్కలు ఉన్నవారు అదృష్టవంతులు. తనకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించేది ఈ గ్రహం మీద ఉన్న ఏకైక జీవి కుక్క మాత్రమే. తన యజమానిపై కుక్కకు ఉండే ప్రేమ పరిస్థితులకు అతీతంగా ఉంటుంది. 
 
కాబట్టి ప్రతి ఒక్కరూ కుక్క ప్రియులు అయినా కాకపోయినా మీ వీధి కుక్కలకు కాస్త ఆహారం అందించి వాటిని ప్రేమగా చూసుకోండి. ఈ విశ్వంలో అత్యంత విశ్వసనీయ భాగస్వాములు కుక్కులకు మించి లేపు. కాబట్టి ఈ రోజు నుంచైనా ఒక కుక్కకు ఆశ్రయం ఇవ్వండి. ఇదే మనం శునకాలకు చేసే విలువైన మేలు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు