గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ ఏపీకి వ‌చ్చి నేటికి రెండేళ్ళు!

శనివారం, 24 జులై 2021 (11:56 IST)
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ‌చ్చ‌ని బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ నేటితో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వివాద‌ర‌హితుడిగా, మ‌హోన్న వ్య‌క్తిగా పేరొందిన ఈ ప్ర‌థ‌మ పౌరుడికి రాష్ట్ర ప్ర‌జ‌లు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఒడిశాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన సామాన్య వ్యక్తి. 1962లో ఒడిశా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు. 1975లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జేపి చేపట్టిన ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించటానికి వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరాటంలో సుమారు ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు.
 
హరిచందన్ ఒడిశా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు శాసనసభకు ఎన్నికైన ఆయన నాలుగుసార్లు మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ, న్యాయ, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, ఆహారం-పౌర సరఫరాలు, కార్మిక-ఉపాధి, గృహనిర్మాణ, సాంస్కృతిక వ్యవహారాలు, మత్స్య, జీవజాతుల వృద్ధి.. ఇలా పలు కీలక శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారు. 2000లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన ప్రత్యర్ధిపై 96వేల ఓట్ల తేడాతో విజయం సాధించి ఒడిశాలో మునుపటి రికార్డులు అన్నింటినీ తిరగరాశారు. తన ప్రజా జీవితంలో అవినీతికి వ్యతిరేకంగా అలుపెరుగని యుద్ధం చేశారు.  
 
1977లో ఒరిస్సా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న  హరిచందన్ ఎమర్జెన్సీ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోకుండా బ్లాక్ మార్కెట్ విక్రేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యతో ఒడిశా ప్రజల మన్ననలు పొందారు. 
 
రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా తనకు ఇష్టమైన రచనా వ్యాసాంగాన్ని  హరిచందన్ ఎప్పుడూ విడిచి పెట్టలేదు. 1817 పైక్ విప్లవ సారధి బుక్సీ జగబంధుపై ఆయన రాసిన నాటకం ‘మహా సంగ్రామర్ మహానాయక్’ అత్యంత ప్రశంసలు పొందింది. మరుభతాష్, రానా ప్రతాప్, శేష్ ఝలక్, మేబార్ మహారాణి పద్మిని, అస్తా సిఖా, తపంగ్ దలాబెరా యొక్క వీరోచిత యుద్ధం & త్యాగం, మనసి (సామాజిక), అభిసప్త కర్ణ (పౌరాణిక), ‘స్వచ్ఛ ససనారా గహనా కథ’ 26 - చిన్న కథల సంకలనం, ‘యే మాటిర్ డాక్’ - కొన్ని ప్రచురించిన వ్యాసాల సంకలనం, ‘సంగ్రామ్ సరి నహిన్’ హరిచందన్ ఆత్మకథ. ప్రజా జీవితంలో సుదీర్ఘమైన, విశిష్టమైన రాజకీయ, పరిపాలన, సామాజిక, సాంస్కృతిక ఇతర రంగాల్లో ఆయన చేసిన పోరాటాన్ని ఇది వివరిస్తుంది. గవర్నర్‌గా తీరికలేకుండా ఉన్నప్పటికీ  హరిచందన్ కాలమిస్టుగా కొనసాగుతున్నారు. సమకాలిన అంశాలపైన తనదైన శైలిలో రచనలు చేస్తున్నారు.
 
రాష్ట్ర విభజన అనంతరం జూలై 24, 2019న బిస్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు తనకున్న సుసంపన్నమైన అనుభవంతో రాష్ట్ర గవర్నర్‌గా అనేక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ రెండేళ్లు రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనాధికారిగా గవర్నర్ హరిచందన్ విజయనగరం, కర్నూలు జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలను సందర్శించి అక్కడి ఆదివాసీ సమూహాలతో సంభాషించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలపై ఆయన ఎప్పుడూ ఎంతో ఆసక్తి చూపిస్తారు.
 
సామాన్యులు సైతం గవర్నర్‌ను కలుసుకునేందుకు వీలుగా రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. కోవిడ్-19 మహమ్మారి మొదటిదశలో వలస కార్మికులు పడుతున్న వెతలకు, వారి దుస్థితికి చలించిన గవర్నర్  హరిచందన్ రాష్ట్ర ప్రభుత్వం నుండి పలు చర్యలు తీసుకునేలా చేశారు. అలహాబాద్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు, పంజాబ్‌లో చిక్కుకున్న విద్యార్థులు సురక్షితంగా తిరిగి వారి స్వస్థలాలకు చేరుకునేలా చేయడంలో గవర్నర్ అధికారులను సమన్వయ పరిచారు.
 
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షుడిగా ఉన్న హరిచందన్ వలస కార్మికులకు ఆహారం, నీరు, శానిటైజర్, మాస్క్‌లు మొదలైన వాటిని సరఫరా చేయడం ద్వారా వారికి సహాయపడాలని అధికారులకు నిరంతరం మార్గనిర్దేశం చేశారు. వాలంటీర్లను ఫ్రంట్ లైన్ కార్మికులతో కలిసి పనిచేయమని ప్రోత్సహించారు.
 
కోవిడ్-19 మహమ్మారి రెండవదశను ఎదుర్కొనేందుకు వివిధ ఎన్జీఓల నుంచి స్వీకరించిన కోవిడ్-19 టెస్ట్ కిట్లు, పల్స్ ఆక్సిమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, మెడికల్ కిట్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొవిడ్ రోగులకు పంపిణీ అయ్యేలా గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమన్వయం కొనసాగించారు. ఏ ఆదరణ లేక ఇంట్లో ఒంటరిగా ఉన్న కోవిడ్-19 రోగులకు టెలికన్సల్టేషన్ ద్వారా వైద్య నిపుణుల సలహాలు అందేలా చొరవ తీసుకున్నారు.
 
చిన్నారుల మధ్య చిన్నారిలా కలిసిపోయి వారితో సమయాన్ని గడిపేందుకు గవర్నర్ ఎక్కువుగా ఇష్టపడతారు. రాజ్ భవన్ ప్రాంగణంలో జరిగే నూతన సంవత్సర వేడుకలు, అలాగే  దీపావళి సంబరాల సమయంలో వివిధ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మిఠాయిలు, దుస్తులు పంపిణీ చేయడం, వారితో కూర్చుని భోజనం చేయడం, సంభాషించడం వంటివి రాజభవన్‌లో సాధారణంగా కనిపించే దృశ్యాలు.
 
తన క్షేత్రస్థాయి పర్యటనలకు అధికారులు భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడం, పెద్దఎత్తున పుష్పగుచ్ఛాలు అందించడం, రెడ్ కార్పెట్ వేయడం వంటివి గమనించిన గవర్నర్ తన పర్యటనల కోసం అతిగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సంప్రదాయంగా వస్తున్న ఇటువంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయన భావించారు.
 
గవర్నర్ హరిచందన్‌ విశిష్ట ప్రజాసేవకు గుర్తింపుగా 2020 ఫిబ్రవరిలో పంజాబ్‌లోని ‘దేశ్ భగత్ విశ్వవిద్యాలయం’ గౌరవ డిగ్రీని ప్రదానం చేసింది. దేశంలోని ప్రముఖ సాహిత్య సంస్థ అయిన ‘సరళ సాహిత్య సంసాద్’ 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘కళింగ రత్న’ అవార్డును అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒడిశాలో జరిగిన కార్యక్రమంలో దేశ ఉపాధ్యక్షుడు శ్రీ ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
 
సామాన్యుడి గవర్నర్‌గా పేరున్న శ్రీ హరిచందన్ ఎల్లప్పుడూ నిరాడంబర జీవితాన్ని కోరుకుంటారు. అనవసర ఖర్చులను, దుబారాకు ఇష్టపడరు. రాజ్ భవన్ పచ్చిక బయళ్ళలో నడక, యోగా సాధనతో ఆయన దినచర్య మొదలవుతుంది. ఆసక్తిగల పాఠకుడిగా పుస్తకాలను చదివేందుకు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నియమబద్దమైన జీవనాన్ని గడిపే గవర్నర్ శ్రీ హరిచందన్ ఎందరికో ఆదర్శంగా, భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు