కరోనా కష్టకాలంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన నెల్లూరు జిల్లా కృష్ణాపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎమ్మెల్సీ ఇవ్వాలని వెన్నెల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ కోరారు. గవర్నర్ కోటాలో ఆనందయ్యను ఎమ్మెల్సీగా చేయాలని ఆయన గవర్నర్‌కు ఓ విజ్ఞప్తి లేఖ రాశారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు గవర్నర్ కార్యాలయం కూడా లేఖ రాయడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సమయంలో ఆయుర్వేద మందు తయారీ చేసి వార్తా పత్రికల్లో ప్రధాన శీర్షికలకెక్కిన ఆనందయ్య... ఆయన మందు కొంతకాలం ఆగిపోవడం, కోర్టు వరకు వ్యవహారం వెళ్లడంతో చాలా రోజులు ఆయన వార్తలు ఆసక్తికరంగా మారాయి.
కరోనా రోగులకు ఆయుర్వేద వైద్యంతో చికిత్స చేస్తోన్న ఆనందయ్యకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను వెన్నెల ఫౌండేషన్ కోరింది. ఇక, తమ వద్దకు వచ్చిన వినతిని పరిశీలించాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు గవర్నర్ కార్యాలయం కూడా లేఖ రాయడం ఇపుడు గమనార్హం.