చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అక్కడ ఇక రాష్ట్రపతి పాలన విధించడానికే బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు జయ ఆస్పత్రిలోనే ఉండాలని డాక్టర్లు తేల్చడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కేంద్రం దృష్టి పెడుతోంది. ముఖ్యమంత్రి ప్రాణం ఉండగా రాజ్యాంగం ప్రకారం ఏమి చేయాలో తర్జభర్జన జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం, తాత్కాలిక సీఎం, రాష్ట్రపతి పాలన… ఇలాంటి ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి.
రాజ్యాంగం ప్రకారం తిరుగుబాటు చేస్తే మినహా ముఖ్యమంత్రి ఉండగా మరో సీఎం నియామకం సాధ్యపడదు. ఇంచార్జి సీఎంను నియమించడానికి గవర్నర్‌కు విశేషాధికారులు ఉన్పప్పటికీ క్యాబినెట్ ఆమోదం కూడా ఉండాలి. దీని మీద ఎవరైనా కోర్టుకు వెళితే.. మళ్లీ తలనొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక, రాష్ట్రపతి పాలన మూడో మార్గం. ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన విధించేందుకు ఇక్కడేమీ చేయిదాటి పోలేదు. అలాంటప్పుడు రాష్ట్రపతి జోక్యం ఎంతవరకు సమంజసం అనే అంశం మీద తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
గవర్నర్ ఆదేశం మేరకు మంత్రులు పళనీ, పన్నీరు సెల్వం శుక్రవారం రాజ్ భవన్‌కు వెళ్లారు. రాజ్ భవన్‌లో గవర్నర్‌తో సమావేశం అయ్యారు. పరిపాలన మీద చర్చించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించాలని ఇంచార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కోరారు. ఆ తరువాత జయ వారసుల పేర్లు తెరమీదకు వచ్చాయి. డిప్యూటీ సీఎంగా పన్నీరు సెల్వం, పళనీస్వామి పేర్లు ప్రముఖంగా తమిళనాడు మీడియా ఫోకస్ చేసింది. జయ మేనకోడలు దీప రెండు రోజులుగా వారసురాలిగా ప్రకటించుకుంటున్నారు. హీరో అజిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జయ బాగున్న రోజుల్లో రాజకీయ వారసునిగా అజిత్ పేరు ప్రస్తావించారని సోషల్ మీడియాలో వీడియో హల్ చల్ చేస్తోంది.
ఇక నెచ్చెలి శశికళ, రాజకీయ సలహాదారు షీలా బాలక్రిష్ణన్ పేర్లు బయటకొస్తున్నాయి. వీటిన్నింటికీ తెరవేయాలంటే, కేవలం డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం మంత్రివర్గంలోని వాళ్లను నియమించడం మేలని గవర్నర్ భావిస్తున్నారట. ప్రధానమంత్రి మోదీ చెన్నై వచ్చి, జయ పరిస్థితిని తెలుసుకున్న తరువాత అసలు కథ మొదలవుతోంది. రాష్ట్రపతి పాలన దిశగా బీజేపీ తమిళనాడును తీసుకెళ్లబోతుందని సుబ్రమణ్యస్వామి పేర్కొంటున్నారు.