కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే త్వరలో అధికార పార్టీలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎప్పటికైనా సైకిల్ ఎక్కడం ఖాయమని వైకాపాకు షాక్ తప్పదంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆయనెవరో తెలుసా? ఆయన ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మొన్నామధ్య కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగన్‌కు విపక్ష నేతగా ఉండే అర్హత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే జయరాం సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఆయన రాకను గమనించిన సీఎం.. మీ ఎమ్మెల్యే మంచోడే, కానీ ఆయనున్న పార్టీనే మంచి కాదంటూ విమర్శించారు. జయరాంను ఆప్యాయంగా పలకరించారు. బాబు విమర్శలను జయరాం ఖండించాల్సిందిపోయి మౌనంగా ఊరుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.