నారా లోకేష్ భవిష్యత్తులో టిడిపికి దిక్సూచి కాగలరా??

సోమవారం, 23 జనవరి 2017 (14:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జన్మదినం నేడు. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ పార్టీలో చక్రం తిప్పుతున్నారు. హెరిటేజ్ పుడ్స్‌కు ఈయన మేనేజింగ్ డైరెక్టర్. తన మామ అయిన నందమూరి బాలకృష్ణ ప్రధమ పుత్రిక అయిన నందమూరి బ్రహ్మణిని వివాహం చేసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు లోకేష్ రాజకీయ అరంగ్రేటం చేసి పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక జరిగిన మహానాడు కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. 50 లక్షలకు పైగా పార్టీ సభ్యత్వం, కార్యకర్తల సంక్షేమ యాత్రలతో లోకేష్, పార్టీలో సత్తా చాటుతున్నారు.
 
ప్రమాదాల్లో మరణించే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేయించిన తొలి పార్టీగా టీడీపీ అవతరించింది. ఇన్సూరెన్స్ చేయించడం అన్నది కూడా పూర్తిగా లోకేష్ యోచనే. నారా లోకేష్ శానసమండలికి ఎంపిక చేసి ఆయన మంత్రి పదవి ఇవ్వనున్నట్లు ఇప్పటికే బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న 2019 ఎన్నికల నాటికి లోకేష్‌ను బలమైన శక్తిగా రూపొందించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తుంది. 
 
2019 ఎన్నికల్లో జగన్, లోకేష్ బాబులు సమవుజ్జీలుగా బరిలో దిగే అవకాశం లేకపోలేదు. ఐతే జగన్‌ను ఢీకొట్టే శక్తిగా లోకేష్ మారాలంటే ఆయన ఇంకా శ్రమించాల్సి ఉంది. ప్రక్క రాష్ట్రమైన తెలంగాణా కెసిఆర్ తనయుడు కెటిఆర్ ఇప్పటికే అక్కడ పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ఇంకా అంత పట్టు లోకేష్ బాబుకు ఇక్కడ లేదు. ఇంకా చాలా విషయాలపై లోకేష్ పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి, కార్యకర్తలకు ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆయన చొరవ చూపాలి. 
 
రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించి ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. నందమూరి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలను పెంపొందించుకొని, పార్టీ కార్యకర్తలతోను - ప్రజలతోను మమేకమై, పార్టీ నాయకుల మధ్య సమన్వయం సాధించే ప్రయత్నం చేస్తూ లోకేష్ ముందుకు సాగితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా మారగలరు.

వెబ్దునియా పై చదవండి