ఎంజీఆర్ తలపిస్తున్న పన్నీర్... తరలివస్తున్న కార్యకర్తలకు కడుపునిండా భోజనం...

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:32 IST)
అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ ఆ పార్టీ కార్యకర్తలకు దైవసమానుడు. ఆయన మాటే వేదం. నాటి నుంచి నేటి వరకు ఆయన అడుగు జాడల్లో లక్షలాది మంది కార్యకర్తలు నడుస్తూ తమ భక్తిప్రపత్తులను చాటుతున్నారు. ఆ తర్వాత దివంగత జయలలిత అంతటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇపుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా అన్నాడీఎంకే కార్యకర్తలకు అలానే కనిపిస్తున్నారు.
 
పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో అన్నాడీఎంకేలో చీలిక ఏర్పడిన విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి పీఠం కోసం ఒకవైపు శశికళ మరోవైపు.. పన్నీర్ సెల్వం పోటీపడుతున్నారు. దీంతో శశికళ వర్గం తమ వైపున్న శాసనసభ్యులను కాపాడుకునే ప్రయత్నాల్లో ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు. 
 
కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం వర్గం స్వేచ్ఛగా బయట ఉండటంతో ఆయన ఇంటి వద్ద హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. తన ఇంటికి వచ్చిన వారికి భోజనాలు కూడా వడ్డిస్తూండటంతో ఆయన తీరును ఎంజీఆర్‌తో అభిమానులు పోల్చుకుంటున్నారు.  
 
అదేసమయంలో పన్నీర్‌సెల్వం నివాసం వద్ద భద్రతను పెంచారు. పార్టీ నిర్వాహకుల నుంచి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఆయన నివాసం వద్ద భద్రతను పెంచారు. ఆర్‌.ఏ.పురంలోని పన్నీర్‌సెల్వం నివాసం వద్ద మూడు రోజులుగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. 
 
రాత్రి పగలు తేడా లేకుండా కార్యకర్తలు వస్తూండటంతో అక్కడ రద్దీ నెలకొంది. మూడు రోజులూ ఇదే పరిస్థితి నెలకొనగా శుక్రవారం మాత్రం అకస్మాత్తుగా ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టారు. పన్నీర్‌ నివాసం ఎదుట పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు వేచి ఉండటానికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. 
 
అలాగే, తన ఇంటికి వస్తున్న కార్యకర్తలకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ప్రభుత్వ గృహంలో పన్నీర్‌సెల్వం ఉంటున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ మంత్రులు, శాసనసభ్యులు, కార్యకర్తలు ఇంటికి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ జీవించి ఉన్నప్పుడు తన ఇంటికి వచ్చిన కార్యకర్తలందరికీ భోజనం ఏర్పాటు చేసేవారు. 
 
ఆయన బాణీలో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన ఇంటికి వస్తున్న పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలకు, ప్రజలకు, పాత్రికేయులకు, భద్రతా పనుల్లో ఉంటున్న పోలీసులకు మూడు పూటలా భోజనం పెడుతున్నారు. బయట వేచి ఉన్న ప్రజలకు కూడా శీతల పానీయాలు, తాగునీరు, టీ, కాఫీ అందజేస్తున్నారు. మరుగుదొడ్డి సౌకర్యం కూడా కల్పించారు. అందుకే పన్నీర్‌ సెల్వంను మరో ఎంజీఆర్‌గా పోల్చుతున్నారు.

వెబ్దునియా పై చదవండి