2014 ఎన్నికలకు ముందే పార్టీ పెట్టినా పోటీకి దిగలేదు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతుతో సరిపెట్టుకుంది. అయితే, 2019 సాధారణ ఎన్నికల్లో పోటీచేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. ఇంతకీ ఆపార్టీ 2019 ఎన్నికల్లో అన్ని స్థానాలకు స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా ఇప్పుడున్న అధికార, ప్రతిపక్షాలతో జతకట్టి ఏదో కూటమిలో చేరి కొన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందాన్నది ఇప్పట్లో తేలేదికాదు. అయితే, ఆ పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేనకు 57 నుంచి 62 స్థానాలు దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటే ఇదే విషయాన్ని ఆ పార్టీ అధికారప్రతినిధి సుంకర కళ్యాణ్ దిలీప్ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ స్టాండ్ ఎలా ఉంటుందన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో, ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్ వ్యవహార తీరుపై ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. ఇప్పుడే విమర్శలు చేయడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదన్న ఉద్దేశ్యం ఆ పార్టీల్లో కనిపిస్తోంది. పవన్‌కు ఉన్న అభిమానమంతా ఓట్ల రూపంలోకి మారుతుందా అంటే, చెప్పలేని పరిస్థితి. అయితే, పవన్ ప్రభావం ఎంతో కొంత అయితే ఉంటుందన్నది స్పష్టం. ఆ పార్టీ ప్రతినిధి చెప్తున్న లెక్కలే నిజమైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కింగ్‌మేకర్‌గా మారడం ఖాయం.