అక్టోబర్ తరువాత పవన్ కళ్యాణ్ దబిడ దిబెడే... ఆ పార్టీల గుండెల్లో దడదడే(వీడియో)

బుధవారం, 2 ఆగస్టు 2017 (14:22 IST)
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ టార్గెట్ ఏపీ ముఖ్యమంత్రి పీఠమేనా? అక్టోబర్ తరువాత ప్రత్యక్ష రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా.. ఇప్పటికే రెండు సినిమాలు చేస్తున్నా.. మా నిర్మాతలను ఒప్పిస్తా.. రాజకీయాలు.. ప్రజా సమస్యలపైనే ఎక్కువ దృష్టి సారిస్తా.. ఇదంతా విజయవాడలో జరిగిన ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్‌ చెప్పిన మాటలు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో జనసేన స్టాండ్ ఏంటన్నది మాత్రం చెప్పలేదు. కానీ నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాత్రం స్పష్టమైన ప్రకటన చేశారు. ఎక్కువ సేపు రాజకీయాలకే కేటాయించి జనసేన పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
 
అంతేకాదు పార్టీలో నేతలకు పదవులను ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నానని చెప్పారు పవన్. పవన్ ప్రకటన అటు టిడిపి, ఇటు వైసిపికి మింగుడు పడటం లేదు. పవన్ కేవలం మాటలు చెబుతారే తప్ప అనుకున్నది చేయరన్నది రెండు ప్రధాన పార్టీల ఆలోచనగా ఇన్నాళ్లూ వున్నది. గత ఎన్నికల్లోను అదే జరిగింది. బిజెపి-టిడిపికి అనుకూలంగా పవన్ కళ్యాణ్‌ ప్రచారం చేశారు. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సొంతంగా పార్టీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. సినిమాల్లోనే బిజీగా ఉన్నా అడపాదడపా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. 
 
కానీ మరో రెండు నెలల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉంటానని, ప్రజా సమస్యలపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు. పవన్ తను చెప్పినట్లే చేయడం మొదలుపెడితే రెండు ప్రధాన పార్టీలకు ఇబ్బందులు తప్పవు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓట్లు చీలిపోతాయి. ఇది అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితే ఉంటే అధికారం ఎవరిదన్నది ఎవరూ చెప్పలేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డిలు వేర్వేరుగా పవన్‌ను బుజ్జగించి ఎన్నికల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తారా.. లేకుంటే తాడోపేడో తేల్చుకుందామన్న నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. కానీ ఇప్పుడు మాత్రం అటు టిడిపి, ఇటు వైసిపి నేతల్లో పవన్ ప్రసంగం మొత్తం కలవరపెడుతోంది. చూడండి వీడియో... 

వెబ్దునియా పై చదవండి