నటులు రాజకీయాల్లో రాణించడం అంటే అది ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితకే సరిపోయిందంటారు చాలామంది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటూ ఏలేసిన చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి ఎలా అభాసుపాలయ్యారన్నది తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆయన తమ్ముడు జనసేన పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయన పార్టీని అప్పుడే ఆయన వైరి వర్గం సెటైర్లతో ముంచెత్తుతోంది. జనసేన పార్టీ తీరం దాటలేని తుఫాన్ అంటూ భలేగా అభివర్ణించేస్తూ తమాషా చేస్తుంది.
ఇక ఇప్పుడు తమిళనాడులో రజినీకాంత్ వంతు వచ్చింది. జయలలిత ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనే ఎన్నోమార్లు రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చారు రజినీకాంత్. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అంటున్నారు. భాజపా ఒకవైపు తమ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపుతుంటే మరోవైపు రజినీకాంత్ మాత్రం తన అభిమానుల అభిప్రాయం మేరకే నడుచుకోవాలని వారితో భేటీలపై భేటీలు చేస్తున్నారు.
ఇదిలావుంటే... మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ విషయం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో చిరంజీవి రాజకీయాల్లో అనుభవాల గురించి రజినీకాంత్ వాకబు చేసినట్లు సమాచారం. ఆయన పార్టీ పెట్టి ఎందుకు అలా అయిపోయిందన్న దానిపై ఆయన లోతుగా పరిశీలన చేసినట్లు చెప్పుకుంటున్నారు. తమిళనాడులో తను కూడా ఒకవేళ పార్టీ పెడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానిపై ఆయన తన అభిమానులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.