చిత్తూరులో మరో ఎర్రచందనం లేడీ డాన్ - రూ.కోట్లలో సంపాదన
బుధవారం, 22 మార్చి 2017 (14:02 IST)
వృత్తి ధర్మాన్ని మర్చిపోకూడదు అన్నది పెద్దల మాట. అదేదో వారసత్వంగా వచ్చిన వృత్తిగా భావించి అక్రమాలకు పాల్పడుతున్నారు. "కూటి కోసం కోటి విద్యలు" అన్న సామెతను ఎంతో ప్రొపిషనల్‌గా ఫాలో అవుతున్నారు. సకుటుంబ సపరివారి సమేతంగా అన్నట్లు కుటుంబం మొత్తం స్మగ్లింగ్‌నే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటివారు వారి కుటుంబంలో ఉండే రేపటి తరంవారికి కూడా ఈ వృత్తినే వారసత్వంగా అందించినా ఆశ్యరపోవాల్సిన అవసరం లేదు. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఇప్పటివరకూ ఎన్నో కోణాలు వెలుగు చూశాయి. కానీ తాజాగా దొరికిన వారి కథ వింటుంటే కాస్త విచిత్రంగానూ, మరికొంత ఆశ్యర్యంగానూ ఉంది. ఇంతకీ ఈ కథేంటో మీరూ చదవండి.
ఇప్పటివరకు మగవాళ్లు మాత్రమే చేస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి మహిళలు కూడా చేరారు. తాజాగా ఫ్యామిలీలు సైతం రెడ్‌శాండిల్ అక్రమ రవాణాలో పట్టుబడ్డారు. తమిళనాడులోని వేలూరు అళగిరినగర్‌కు చెందిన ఎన్.జ్యోతి, ఆమె భర్త, ఇద్దరు కొడుకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ వ్యాపారంలో జ్యోతి పాత్ర తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.
నిజానికి జ్యోతి నాలుగో తరగతితోనే విద్యాభ్యాసాన్ని ముగించింది. భర్త నాగేంద్రన్ లారీ డ్రైవర్ కావడంతో మొదట ఇసుక లోడులు తీసుకెళుతూ ఎర్ర చందనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ విషయం జ్యోతికి చెప్పడంతో అవకాశాన్ని వదులుకోవద్దని భర్తకు చెప్పి తానూ కూడా 2013 నుంచి స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తింది ఆ కుటుంబం. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంది.
ఈ క్రమంలో వీరప్పన్ కంచుకోటైన జవ్వాదిమలై గ్రామం నుంచి చెట్లను నరికే కూలీలను పిలిపించి శేషాచలం అడవుల్లోకి పంపి ఎర్రచందనం దుంగలు తరలించడమే పనిగా పెట్టుకుంది. ఇలా మూడేళ్ల కాలంలో జిల్లా నుంచి వంద టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై చిత్తూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి.
వీరికోసం పోలీసులు ఎప్పటి నుంచో గాలిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎవ్వరికీ అనుమానంరాకుంగా వీరు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేశేవారు. వెనుక లారీలో ఎర్రచందనం దుంగలు వస్తుంటే ముందర స్కార్పియో వాహనంలో కుటుంబ సమేతంగా పైలట్‌లా వ్యవహరించి పోలీసుల నిఘాను పసిగడుతూ చాకచక్యంగా తప్పించుకునేవారు.
అయితే, ఆదివారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు బెంగళూరు - తిరుపతి బైపాస్ రోడ్డులోని పి.కొత్తూరు వద్ద లారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో టన్ను బరువున్న 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్నారు. జ్యోతి, నాగేంద్రన్‌తోపాటు వారి ఇద్దరు కుమారులు, జ్యోతి చెల్లెలి కొడుకు వెట్రివేల్‌లతో పాటు డ్రైవర్ కె.కుమార్‌ను అరెస్టు చేశారు.
ప్రస్తుతం జ్యోతి అరెస్టు కావడంతో ఆమె వెనుక ఉన్న బడా స్మగ్లర్లు రామ్‌నాథ్, రంగనాథ్, మాలూర్ బాషా కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక మహిళా డాన్ సంగీతా ఛటర్జీ బాగోతాన్ని మర్చిపోలేకపోతున్న పోలీసులు తాజాగా పట్టుబడిన మరో లేడీ డాన్ జ్యోతి వివరాలను లోతుగా సేకరిస్తున్నారు.