మధ్యాహ్నమే అమ్మ మృతి.. అర్థరాత్రి వరకూ అధికారం కోసం శశికళ... తెల్లకాగితాలతో ఎమ్మెల్యేలకు...

శుక్రవారం, 9 డిశెంబరు 2016 (16:49 IST)
ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్థివదేహం సాక్షిగా చీకటి రాజకీయం సాగింది. వాస్తవానికి 75 రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జయలలిత ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకే చనిపోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని తొలుత శశికళ, మంత్రి పన్నీర్ సెల్వంకు మాత్రమే తెలుసుననీ, కానీ, అపోలో ఆస్పత్రి యాజమాన్యం మాత్రం జయలలిత మరణవార్తను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా, రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావుకు చేరవేసినట్లు సమాచారం. ఆ తర్వాతే శవ రాజకీయానికి తెరలేసింది. అప్పటివరకు దూరంగా ఉన్న మన్నార్గుడి మాఫియా అపోలో ఆస్పత్రిలో వాలిపోయింది. అధికార మార్పిడికి సరికొత్త ఎత్తులు వేసింది. అయితే, ఈ అధికార మార్పిడి అనేది పైకి అనుకున్నంతగా, కనిపించినంతగా సలభంగా సాగలేదని తెలుస్తోంది. 
 
సోమవారం అర్థరాత్రి 11.30 గంటలకు జయలలిత మృతి చెందినట్లు అధికారిక ప్రకటన వెలువడటానికి ముందు చాలా తతంగం చోటుచేసుకుంది. జయలలిత నెచ్చెలి శశికళ ఒక్కసారిగా ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. జయలలిత దూరంగా పెట్టిన శశికళ భర్త నటరాజన్‌తో పాటు ఆమె బంధువర్గం అంతా ఒక్కసారిగా అక్కడికి వచ్చి వాలేలా ఆదేశించింది. పన్నీర్ సెల్వంకు బదులు తనకు నమ్మకస్తుడైన మంత్రి ఎడపాటి పళని స్వామిని ముఖ్యమంత్రిని చేయడానికి శశికళ శరవేగంగా పావులు కదిపారు. 
 
తమిళనాడు అధికార పీఠం కోసం జరగరానిది జరిగిపోతోందని సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఆగమేఘాల మీద కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెన్నై రావడం, రాత్రికి రాత్రే పన్నీర్ సెల్వంతో పాటు మంత్రి వర్గంతో గవర్నర్ విద్యా సాగరరావు పదవీ ప్రమాణ స్వీకారం చేయించడం చకచకా జరిగిపోయింది. జయలలిత పార్థివదేహం ఆసుపత్రిలో ఉండగానే అపోలో ఆసుపత్రి వేదికగా శశికళ రాజకీయం నడిపిన తీరు ఒక్కొక్కటిగా ఇపుడు బయటకు వస్తోంది. అసలు డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఏం జరిగిందో ఓసారి పరిశీలిస్తే...
 
సోమవారం (5-12-16) మధ్యాహ్నం 2.30 గంటలకు అమ్మ చనిపోయినట్టేనని వైద్య బృందాలు శశికళతో పాటు పన్నీర్ సెల్వంకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా, గవర్నర్ విద్యా సాగరరావుకు అపోలో ముఖ్యులు ఈ విషయం చేరవేశారు. ఈ వార్త నేపధ్యంలో పలు మీడియాల్లో బ్రేకింగ్ న్యూస్‌లు కూడా వచ్చాయి. ఐతే ఆ తర్వాత అమ్మ బాగానే ఉందంటూ ప్రకటించడంతో మీడియా నోరు మూసుకుంది. ఇదిలావుండగా శశికళ సాయంత్రం 4 గంటలకు అపోలో ఆసుపత్రి రెండో అంతస్తులో పన్నీర్ సెల్వం లేకుండానే మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలతో మూడు తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. ఈ సంతకాలు ఎందుకు అని తెలుసుకునే అవకాశం కూడా వారికి ఇవ్వలేదు. ఇందులో 'ఒకటి పళని స్వామిని సీఎంగా చేయడానికి, రెండోది తనను (శశికళ)పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు, మూడోది అమ్మ మృతికి అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి సంబంధం లేదన్నది. వారు ఆమెను బతికించడానికి శక్తికి మించి ప్రయత్నం చేశారు' అని తర్వాత వారికి శశికళ చెప్పింది. 
 
అపోలో వేదికగా జరుగుతున్న రాజకీయ నాటకం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు రంగంలోకి దిగి వెంకయ్య నాయుడిని ఢిల్లీ నుంచి చెన్నైకు పంపించారు. ఆయన రాత్రి 7 గంటలకు చెన్నై అపోలో ఆసుపత్రికి వచ్చారు. శశికళతో వాస్తవ పరిస్థితులను వివరించారు. 
 
రాత్రి 8 గంటలకు శశికళ మరోసారి తన మద్దతుదారులతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాత్రి 12 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పన్నీర్ సెల్వంను శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో అపోలో ఆసుపత్రి వర్గాలు రాత్రి 11.30 గంటలకు జయలలిత చనిపోయినట్లు ప్రకటించాయి. రాత్రి 12.45 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్‌కు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటలకు పన్నీర్ సెల్వంతో పాటు జయలలిత కేబినెట్‌లోని మంత్రులందరితో పదవీ ప్రమాణా స్వీకారం చేయించారు.

వెబ్దునియా పై చదవండి