అతివేగం ఆరుగురి ప్రాణాలు తీసింది.. వ్యానును ఢీకొట్టిన కంటైనర్ లారీ!

వరుణ్

శనివారం, 15 జూన్ 2024 (13:49 IST)
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆరుగురి ప్రాణాలు తీసింది. ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయిన ఓ వ్యాను... ట్రాక్టర్ వెనుక వైపు ఢీకొట్టి... మధ్యలోనే ఆగిపోయింది. ఇంతలో వేగంగా వచ్చిన ఓ కంటైనర్ లారీ... మినీ వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాసలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. 
 
కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం వివరాలను పోలీసులు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళ్లరేవు వైపు నుంచి డ్రైవర్ సహా పదిమంది కూలీలు బంటుమిల్లి మండలం తుమ్మడిలో చేపల ప్యాకింగ్ కోసం మినీ వ్యానులో గురువారం రాత్రి 1.30 గంటలకు బయలుదేరారు. తెల్లవారుజామున నాలుగైదు గంటలకు శీతనపల్లి వద్ద ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేయబోయి వెనకవైపు ఢీకొట్టి అదే వేగంతో ముందుకెళ్లి రోడ్డు మధ్యలో వ్యాన్ ఆగిపోయింది. అదేసమయంలో అటువైపు వేగంగా వస్తున్న కంటెయినర్ లారీ మినీ వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ, వ్యాన్ నుజ్జునుజ్జు అయ్యాయి.
 
ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. గాయపడిన వారిని మచిలీపట్టణం సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులను మంత్రి కొల్లు రవీంద్ర, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కాగా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మరో ఆరుగురు మృతి చెందారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు