తమిళ రాజకీయాలపై తెలుగు మీడియా ఛానళ్ళ అత్యుత్సాహం ఆశ్చర్యంగానూ, అతిశయోక్తిగానే ఉంది. శశికళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే మేం చూడలేం అన్నట్లుగా తెలుగు మీడియా రంకెలేస్తోంది. వీళ్ళు ఇక్కడ రంకెలేసినా, గాండ్రించినా తమిళనాడు రాజకీయం జరిగేది జరుగకమానదు. కానీ ఆత్మసంతృప్తి కోసం తెలుగు మీడియా పడుతున్న పాట్లు అన్నిఇన్నీ కాదు.
శశికళ మన తెలుగు మీడియా దృష్టిలో దుష్టురాలు. అలా డిసైడ్ అయిపోయి దూసుకెళుతున్నాయి ఛానళ్ళు. ఒకప్పుడు ఎన్.టి,ఆర్‌కు వెన్నుపోటు ఘట్టాన్ని ఘనకార్యంగా ప్రపంచానికి చాటిచెప్పిన మీడియా కూడా ఇప్పుడు తమిళనాడు విషయానికి వచ్చేసరికి మరోలా వాపోతోంది. చంద్రబాబు వైపు అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అని గతంలో తీర్మానించిన టిడిపి అనుకూల మీడియా తమిళనాడుకు వచ్చేసరికి మాత్రం శశికళ వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా సరే ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదని వితండవాదం చేస్తోంది.
తమిళ రాజకీయం తగులబడుతుంటే ఆ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు రెండు మూడు రోజులుగా అటువైపు కూడా చూడకుండా పలు ఈవెంట్లకు హాజరవుతుంటే ఏ ఒక్క మీడియా కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకంటే గవర్నర్, కేంద్రం ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు కాబట్టి. శశికళను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవడం ద్వారా అన్నాడిఎంకే ఎమ్మెల్యేలు ఘోర తప్పిదం చేయబోతున్నారన్నది మన తెలుగు మీడియా మరో ఆవేదన.
అంటే సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుందో గవర్నర్‌కు ముందే తెలుసా? ఒకవేళ ఆమె నిజంగా నేరం చేసి ఉంటే సుప్రీంకోర్టు ఆమెకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే అప్పుడు ఆమె పదవి నుంచి దిగిపోతారు. మరో ముఖ్యమంత్రి వస్తారు. కానీ కేసులు సాకుగా చూపి గవర్నర్ తమిళనాడు వైపు రాకుండా దేశం మొత్తం తిరగడం అన్నది గవర్నర్ వ్యవస్థకే సిగ్గుచేటు అన్న విమర్శలు లేకపోలేదు. ఎలాగో కేంద్రంలో ఉన్నది మోడీ ప్రభుత్వమే కాబట్టి తమిళనాడులో అన్నాడిఎంకే ఎమ్మెల్యేలకు తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అధికారం హక్కు లేదని కేవలం గవర్నర్, బిజెపికి ఇష్టమైనే వ్యక్తులనే సీఎంగా ఎన్నుకోవాల్సి ఉంటుందని రాజ్యాంగ సవరణ చేయిస్తే పోలా..!