ఫ్యాక్షనిజం. ఈ పేరు వింటే కడప మాత్రమే గుర్తుకువస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ ప్రస్తుతం తమిళనాడులో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతున్నాయి. కారణం రోజుకోవిధంగా మారుతున్న రాజకీయాలు. ఒకరిపై ఒకరు ఆరోపణలు..ఒకరిపై ఒకరు ఫిర్యాదులు. ఇలా ఒకటి కాదు తమిళనాడులో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే తాజాగా జయలలిత వారసుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
ఎవరికి వారు ఆరోపణలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసేసుకుంటున్నారు. జయ ఆస్తుల వ్యవహారమే ఇందుకు ప్రధాన కారణం. శశికళతో కలిసిపోయిన జయ అన్న జయరామన్ కొడుకు దీపక్ ఎలాగైనా ఆస్తిని తనకు మాత్రమే దక్కే విధంగా చూడాలన్నదే అతని ఆలోచన. అందుకే సొంత చెల్లెలు దీపతో వైరం పెంచుకున్నాడు. అంతటితో ఆగలేదు. సొంత అన్నాచెల్లెల్లో ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు.
గత రెండురోజుల ముందు పోయెస్ గార్డెన్ వద్ద జరిగిన హైడ్రామా అంతాఇంతా కాదు. చెల్లెల్ని మాట్లాడటానికి పిలిచిన అన్న దీపక్ ఆ తరువాత లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో దీప, దీపక్‌ల మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇదంతా జరుగుతుండగానే దీప భర్త మధుకర్ నేరుగా తమిళనాడు కమిషనర్ కార్యాలయంకు వెళ్ళి దీపకు, తనకు ప్రాణహాని ఉందని అది కూడా దీపక్, దినకరన్ వల్లనే అంటూ ఫిర్యాదు చేశారు. ఆ తరువాత దీపక్‌కు పోలీసులకు దీప, మాధవన్‌ల మీద ఫిర్యాదులు చేశాడు. ఇలా ఎవరికి వారు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేశారు.