రెట్టించిన ఉత్సాహంలో కేసీఆర్ - సంకటంలో చంద్రబాబు

గురువారం, 6 సెప్టెంబరు 2018 (21:03 IST)
తెలంగాణ రాష్ట్ర సమతి అధినేత కె.చంద్రశేఖర్‌రావు (కెసిఆర్‌) ఏది చేసినా సంచలనమే. అధికారం పీఠంపై ఇంకా తొమ్మిది నెలల పాటు ఉండటానికి అవకాశం ఉన్నా… అసెంబ్లీని రద్దు చేయడమేగాక, 105 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి ముందస్తు ఎన్నికలకు సై అంటున్న కెసిఆర్‌లో సమరోత్సాహం కనిపిస్తోంది. మొన్నటి బహిరంగ సభలో కెసిఆర్‌ మాటల్లో వాడి వేడి తగ్గిందన్న విమర్శలు రావడంతో… అసెంబ్లీ రద్దు ప్రకటన మీడియాకు చెప్పడానికి నిర్వహించిన సమావేశంలో తనదైన శైలిలో విరుచుకుపడుతూ మాట్లాడారు. అసెంబ్లీ రద్దు చేయడమే ఒక సంచలనమైతే… కనీసం టిఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఊహించని విధంగా 105 మంది పేర్లు ప్రకటించడం చూస్తుంటే కెసిఆర్‌ ఎంత సన్నద్ధంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తిరిగి అధికారంలోకి రాగలనన్న ధీమా ఆయన మాటల్లో కనిపించింది. 
 
50 రోజుల్లో 100 సభలు నిర్వహించి, ఎన్నికల ప్రచారం హోరెత్తించడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. కెసిఆర్‌లో ముందస్తు సమరోత్సాహం ఇలావుంటే… ఆయన గురువుకు మాత్రం అది సంకటమే. ఇంతకీ గురువంటే ఎవరో కాదు చంద్రబాబు నాయుడే. ఎందుకంటే… కెసిఆర్‌కి రాజకీయ గురువు తానేనని గతంలో చంద్రబాబు నాయుడే స్వయంగా ఒక సందర్భంలో చెప్పుకున్నారు. ఇప్పుడు బాబుకు వచ్చిన తంటా ఏమంటే… తెలంగాణలో దాదాపు టిడిపి కనుమరుగైన పరిస్థితి. అయినా… మా ఓటింగ్‌ మాకుంది… మా ఓటింగ్‌ చెక్కు చెదరలేదు అని టిడిపి నాయకులు పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు. 
 
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటైనా గెలిచే పరిస్థితి టిడిపికి లేదు. ఇప్పుడు ఎవరో ఒకరు తోడుంటే తప్ప ఎన్నికల్లో నెట్టుకురావడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకే తన చిరకాల శత్రువైన కాంగ్రెస్‌తో జత కట్టడానికి కూడా టిడిపి సిద్ధమయిందనే వాదనలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఆ మధ్య కర్నాకటలో కాంగ్రెస్‌-జెడిఎస్‌ ప్రభుత్వ బాధ్యతల స్వీకరోత్సవానికి బాబు హాజరయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటేశారు. ఇటీవల రాహూల్‌ గాంధీ తెలంగాణకు వస్తే… పారిశ్రామికవేత్తల పేరుతో నారా బ్రాహ్మణి సహా పలువురు టిడిపి నేతలు ఆయన్ను కలిశారు. 
 
చిరకాల శత్రువునైనా కౌగిలించుకోడానికి టిడిపి సిద్ధమైతే… దానికి ఎలాగైనా గండికొట్టాలని కెసిఆర్‌ చూస్తున్నారు. అప్పుడే కెసిఆర్‌ తన ప్రచారం మొదలుపెట్టారు. ‘తెలంగాణ నీళ్ల నుంచి ప్రతిదానిపైనా ఆటంకాలు సృష్టించే వారితో, కోర్టుల్లో కేసులు వేసేవారితో ఎలా జతకడతారు…. మళ్లీ ఆంధ్రా పెత్తనం తెస్తారా’ అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఘాటుగానే మాట్లాడారు. దీన్నిబట్టే టిడిపి గురించి కెసిఆర్‌ చేయబోయే ప్రచారం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే టిడిపిని తెలంగాణ వ్యతిరేక పార్టీగా కెసిఆర్‌ ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ అదే అస్త్రాన్ని ఉపయోగించి అటు కాంగ్రెస్‌ను ఇటు టిడిపిని దెబ్బకొట్టడానికి సిద్ధమవుతున్నారు.
 
ఇటీవలో అమరావతిలో జరిగిన ఓ విలేకరుల సమావేశంలో విలేరులు చంద్రబాబును ఒక మాట అడిగారు. ‘తెలంగాణలో మీతో పొత్తు పెట్టుకోడానికి కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ రెండు పార్టీలూ ఆసక్తి చూపుతున్నాయట గదా…’ అని అడిగారు. దానికి బాబు ముసిముసిగా నవ్వుకుంటూ ‘మీకు ఎవరు చెప్పారు… ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ దాటవేశారు. 
 
కెసిఆర్‌ మాట్లాడినదాన్ని బట్టి, 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి దానినిబట్టి…. టిఆర్‌ఎస్‌ - టిడిపి పొత్తుకు అవకాశమే లేదని తేలిపోయింది. ఇక్కడో ఇంకో ముచ్చట కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, టిఆర్‌ఎస్‌కు తెదేపా ఇబ్బంది కలిగిస్తే… ఓటుకు నోటు కేసు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. చంద్రశేఖర్‌ రావు ఆపద్ధర్మ ముఖ్యమంత్రే అయినా…. కేంద్రంతో ఉన్న సంబంధాల రీత్యా ఆ కేసును కదిలించడం, ఇరికించడం పెద్ద సమస్య కాబోదు. ఈ కోణంలోనూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం టిడిపికి ఇబ్బందే.
 
ఇక ఆంధ్రప్రదేశ్‌ కోణంలోనూ బాబుకు సమస్యలున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు అనగానే ఉప ముఖ్యమంత్రి కెఇ వంటివారు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడమంటే ఆత్మహత్యాసదృశ్యమే అనే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ పొత్తు ఆచరణలోకి వస్తే కెఇ వంటివాళ్లు ఇంకొందరు కూడా బయటపడి మాట్లాడే అవకాశాలున్నాయి. ఏ విధంగా చూసినా తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు అంత తేలిక కాదనిపిస్తోంది. మరి చంద్రబాబు ఎటువంటి అడుగులు వేస్తారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు