తెలంగాణను టచ్ చేసి టోటల్‌గా దేశంలోనే జీరో అవుతున్న కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్‌లో సున్నానా?
గురువారం, 10 మార్చి 2022 (19:26 IST)
2004 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, రికార్డు స్థాయిలో ఎనిమిదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలెయన్స్ (యుపిఎ)గా పిలువబడే కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తదనంతరం, 2009 సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత యూపీఎ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1962లో నెహ్రూ తర్వాత పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రిగా సింగ్ నిలిచారు.
తెలంగాణ ఏర్పాటుతో అథఃపాతాళానికి హస్తం
ఇక తాజా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఖాతా తెరవలేని స్థితిలోకి వెళ్లిపోయిందంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇరవై ఏళ్ళకు పైగా పదవిలో కొనసాగిన సోనియా గాంధీ పార్టీకి ఎక్కువ కాలం పనిచేసిన అధ్యక్షురాలు. ఐతే తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై నేటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్భం వచ్చినపుడల్లా విమర్శిస్తూనే వుంటారు. తలుపులు మూసి చీకటిలో రాష్ట్ర విభజన చేసారు. తల్లిని చంపేసి బిడ్డను బ్రతికించారు అంటూ ప్రధాని విమర్శలు గుప్పిస్తుంటారు.
ఐతే తెలంగాణ ఏర్పాటు విషయంలో అటు ఆంధ్ర ప్రజలను కానీ ఇటు తెలంగాణ ప్రజల మనసులను కానీ గెలుచుకోలేకపోయారు. రెంటికీ చెడ్డ రేవడిగా మిగిలిపోయారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరుపై ఆ పార్టీలోని నేతలే ఎందరో తిరుగుబావుటా ఎగురవేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. తెలంగాణ ఏర్పాటు చేసాక... 2014 సార్వత్రిక ఎన్నికల్లో 543 స్థానాలున్న లోక్‌సభలో కేవలం 48 సీట్లను మాత్రమే గెలుచుకుని కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
తెలంగాణ తల్లి అంటూ సోనియా విగ్రహాలు
తెలంగాణ విభజన చేసి పూర్తిగా చేతులు కాల్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి పెట్టనికోటగా వుండే ఏపీని చేజేతులా జారవిడుచుకుంది. ఇక్కడ తెలంగాణ ఏర్పాటు చేసాక ఎప్పుడు ఎన్నిక జరిగినా డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది కాంగ్రెస్. రాష్ట్ర ఏర్పాటు విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన సరిగా జరగలేదన్న విమర్శలు సైతం లేకపోలేదు. విభజన విషయంలో రాష్ట్ర ప్రజలను ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ సమర్థంగా చేయలేకపోయిందనీ, దాని ఫలితాలను ఇలా అనుభవించాల్సి వస్తుందని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. ఐతే మొదట్లో సోనియా గాంధీ విగ్రహాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేసిన నాయకులు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వున్నారు.
అభ్యర్థుల పోల్ అఫిడవిట్‌ల విశ్లేషణ ఆధారంగా, నేషనల్ ఎలక్షన్ వాచ్- అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం, 2014 నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. 2014-2021 మధ్య జరిగిన ఎన్నికల సమయంలో మొత్తం 222 మంది ఎన్నికల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఇతర పార్టీల్లో చేరారని, ఈ సమయంలోనే 177 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడారని నివేదిక పేర్కొంది.
పంజాబ్ రాష్ట్రంలోనూ అంతర్గత కుమ్ములాటలను అదుపుచేయలేక చేజేతులా అధికారాన్ని పారేసుకుంది. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటో అగమ్యగోచరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.