గులాబీకి హస్తం గుబులు... ఏంటిలా అవుతోంది...?

శుక్రవారం, 19 అక్టోబరు 2018 (16:09 IST)
టికెట్లు ఆశించి భంగపడ్డ టీఆర్‌ఎస్‌ అసంతృప్తవాదులకు కాంగ్రెస్‌ పార్టీ వల వేస్తోంది. ఇందులో భాగంగానే.. సొంత పార్టీలోని ప్రత్యర్థులను ఓడించాలని భావిస్తోన్న ఇద్దరు టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఇద్దరు ఎంపీలు, ఓ ఎమ్మెల్సీ.. కాంగ్రెస్‌ జాబితాలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నెల 20న రాహుల్‌ గాంధీ పర్యటన తర్వాత వీరంతా పార్టీలో చేరే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డే మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి కలిసి.. టీఆర్‌ఎస్‌ అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. 
 
టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ చాలామంది కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ.. పెద్ద తలకాయలను చేర్చుకునేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీపీసీసీ వర్గాలు చెప్పాయి. అయితే, ఇదంతా కాంగ్రెస్‌ ఆడుతున్న మైండ్‌గేమని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడొకరు కొట్టిపారేశారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే.. కాంగ్రెస్‌ ఇలాంటి ఎత్తులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. 
 
ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన ఓ మంత్రి ఈసారి శాసనసభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌ ఒకేసారి ప్రకటించిన 105 నియోజకవర్గాల అభ్యర్థుల్లో.. తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికి తాజా మాజీ ఎమ్మెల్యే పేరు ప్రకటించడంతో ఆయనతోపాటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పోటీ చేయకపోతే.. ఆ నియోజకవర్గంపై పట్టు కోల్పోతానన్న భావనలో ఆ మంత్రి ఉన్నారు. దీనిని అదనుగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ మంత్రితో రాయబారం నెరిపింది. 
 
తాను కోరుకున్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చేందుకు అంగీకరించినట్లు సందేశం పంపింది. అయితే తనతో పాటు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి మరో చోట నుంచి టికెట్‌ ఇవ్వాలని ఆయన షరతు పెట్టినట్లు తెలిసింది. కొత్తగా పార్టీలో చేరేవారి వివరాలు, వారు పెడుతున్న డిమాండ్లను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన మరో మంత్రి తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ కావాలని కోరుతున్నారు. అయితే సదరు మంత్రికి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో.. టీఆర్‌ఎస్‌ టికెట్‌ రాకపోతే ఆలోచిస్తానని చెప్పినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు