కేసీఆర్‌‍ పొత్తుకు నో చెప్పారు.. కలుద్దామంటే వారం తర్వాత వద్దన్నారు: బాబు

ఆదివారం, 7 అక్టోబరు 2018 (17:45 IST)
ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేశారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో.. చంద్రబాబును లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలను బాబు తిప్పికొట్టారు. తాజాగా చంద్రబాబు కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 


తాను స్నేహ హస్తం చాచినా.. కేసీఆర్ కలిసిరాలేదన్నారు. ఇద్దరం కలుద్దామని.. దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలదే పైచేయి ఉండాలని కేసీఆర్‌కు చెబితే.. కేసీఆర్‌ ఆలోచించి చెబుతానన్నారని తెలిపారు. వారం తర్వాత కుదరదని కేసీఆర్ బదులిచ్చారని బాబు గుర్తు చేసుకున్నారు.  
 
తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీడీపీని ఒంటరిగా పోటీచేయించమని కేసీఆర్ సూచించినట్లు చంద్రబాబు చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు వద్దని కేసీఆర్ అన్నట్లు బాబు స్పష్టం చేశారు. అప్పటికే కేసీఆర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాడని అర్ధమైందన్నారు.
 
2014 ఎన్నికల ముందే ఏపీలో జగన్, తెలంగాణలో టీఆర్ఎస్ వస్తుందని కేసీఆర్ చెప్పారనే విషయాన్ని చంద్రబాబు పార్లమెంటరీ సమావేశంలో గుర్తు చేసుకున్నారు. నమ్మిన బీజేపీ ద్రోహం చేసిందని.. ఇక జాతీయస్థాయిలో కొత్త పొత్తులు మినహా మరో మార్గం లేదన్నారు. వైసీపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అభివృద్ధికి వైకాపా అడుగడుగునా అడ్డం పడుతుందని వాపోయారు.
 
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మెదక్ జిల్లాకు చెందిన కరణం రామచంద్రరావుకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చేవారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. ఎన్టీఆర్ తదనంతరం తాను సీఎంగా ఎన్నికైన తర్వాత కేసీఆర్‌కు ప్రాధాన్యత ఇచ్చినట్టు చెప్పారు. మరోవైపు తన మంత్రివర్గంలో కేసీఆర్‌కు చోటు కూడ కల్పించినట్టు ఆయన గుర్తు చేశారు.
 
తెలంగాణలో తాను చెప్పినట్లు టీడీపీ వింటే ఆంధ్రా రాజకీయాల్లో వేలు పెట్టనని కేసీఆర్‌ మరో మాట అన్నారని బాబు ఎంపీలతో చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కలిసి ఉంటే ఢిల్లీలో ప్రాభవం పెరుగుతోందని తాను చెప్పానన్నారు. అయితే కేసీఆర్ మాత్రం పొత్తుకు అంగీకరించలేదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు