భర్త చూస్తే అలా... బాబు చూస్తే ఇలా... ఇక బ్రతికెందుకు? టీవీ యాంకర్ సూసైడ్

సోమవారం, 2 ఏప్రియల్ 2018 (20:06 IST)
అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమోత్తమైనదని పురాణాలు చెపుతున్నాయి. అలాంటి మానవ జన్మను ఎత్తిన తర్వాత ఈ శరీరానికి ముగింపు ఏనాడు విధి నిర్ణయిస్తుందో అప్పటివరకూ వేచి వుండటమే మానవ జన్మ పరమావధి. ఐతే అకస్మాత్తుగా ఏవో కొన్ని ఒత్తిళ్లు, ఆర్థిక సమస్యలు అంటూ ఆత్మహత్యలకు పాల్పడటం ఇప్పుడు అనేక చోట్ల చూస్తున్నాం. పురాణాల ప్రకారం ఆత్మహత్య మహా పాతకం. భగవంతుడు ఇచ్చిన పూర్తి ఆయువు తీరకముందే తనువు చాలించడం దారుణం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరీది పోరాడటమే మానవుడి లక్ష్యం. ఐతే ఈ ధర్మాన్ని ఆత్మహత్య చేసుకునేందుకు ఉద్యుక్తులైనవారు మర్చిపోయి తనువు చాలిస్తున్నారు.
 
మన పెద్దలు చెప్పినట్లు కష్టాలు మనషులకు రాక చలనం లేని రాళ్లు రప్పలకు వస్తాయా? మనిషిగా పుట్టిన తర్వాత మన ధర్మం మనం నిర్వర్తించాల్సిందే. అప్పటివరకూ ఈ దేహాన్ని ఆత్మార్పణ చేసుకునే అర్హత ఈ జీవుడికి లేదన్నది పురాణలు చెప్పే మాట.
 
ఎవరెన్ని చెప్పినా... ఏ పురాణం ఎంత నొక్కి వక్కాణించినా ఆత్మహత్య చేసుకునేవారు 'నా బ్రెయిన్ నా శత్రువు - నా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు' అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టేసి ఈ బుల్లితెర యాంకర్ రాధికా రెడ్డిలా తనువు చాలిస్తున్నారు. ఆదివారం రాత్రి 10 గంటలకు విధులు ముగించుకుని ఇంటికి చేరిన రాధిక తను నివాసం ఉంటున్న హైదరాబాద్ మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్‌లోని సువీల అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తలకు తీవ్రగాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తన చావుకు ఎవరూ కారణం కాదని.. అంటూ సూసైడ్ నోట్‌లో రాసిపెట్టింది.
 
అయితే ఈమె ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా, ఆర్నెల్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉండడం.. ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగకపోవడం ఆమెను తీవ్రంగా కలచివేశాయి. ఏళ్లతరబడి మనోవేదన అనుభవించిన ఆమె.. ఆదివారం తనువు చాలించింది. మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామానికి చెందిన 36 ఏళ్ల వెంకనగారి రాధికా రెడ్డి ఓ తెలుగు వార్తా చానెల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. ఆమెకు 15 ఏళ్ల కిందట వివాహమైంది. ఆర్నెల్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. 
 
రాధిక ఆరు నెలలుగా 14 ఏళ్లుగా కుమారుడు భానుతేజా రెడ్డితో కలిసి ఒంటరిగా నివశిస్తోంది. అయితే, కుమారుడు మానసికంగా ఎదగకపోవడం, భర్తతో విడిపోవడంతో ఆమె తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వచ్చింది. ఐతే ఈ మానసిక వ్యధకు చావుతో పరిష్కారం కాదనే విషయాన్ని గమనించలేకపోయింది. మానసికంగా ఎదగని తన 14 ఏళ్ల కుమారుడు పరిస్థితి ఏంటన్నది పట్టించుకోలేదు. సహజంగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నవారిలో ఇలాంటి ఆలోచనలకు తావుండదన్నది మానసిక నిపుణులు చెప్పే మాట. 
 
ఐతే వారిలో అలాంటి ఆలోచన రేకెత్తే సమయంలోనే తనకు పరిచయమున్నవారితో ఖచ్చితంగా ఈ తరహా ఆలోచనలు చెప్తారన్నది కూడా నిజమే. ఐతే దాన్ని కొందరు లైట్ గా తీసేసుకుంటారు. కానీ అలాంటి మాటలు మాట్లాడేవారిని సరైన కౌన్సిలింగ్ ఇచ్చి భవిష్యత్తు జీవితంపైన మార్గనిర్దేశం చేస్తే ఎన్ని కష్టాలు వచ్చినా తమ ప్రాణాలను బలవంతంగా వారు తీసుకునే స్థితికి రారన్నది సైక్రియాట్రిస్టుల మాట. సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలకు తావుండకూడదని కోరుకుందాం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు