వెంకయ్యనాయుడి గురించి మేనత్త, మరదలు ఇలా చెప్పారు (వీడియో)

బుధవారం, 19 జులై 2017 (12:33 IST)
అచ్చ తెలుగు పంచకట్టు, ఆరడుగుల ఎత్తు. స్వచ్చమైన మనసు. అపారమైన జ్ఞానం. ఇవన్నీ కలగలిపిన వ్యక్తే వెంకయ్యనాయుడు. ఒక వ్యక్తి సరైన వ్యక్తిత్వాన్ని నమ్ముకుని కష్టపడి పనిచేస్తే ఎంతటి ఉన్నత స్థాయికి చేరగలరో చెప్పడానికి ఆయన జీవితమే ఒక ఉదాహరణ. వీటికి తోడు చాతుర్యం, చాకచక్యం, క్లిష్టమైన ప్రజా సమస్యలను పరిష్కరించడంతో ఆయన చొరవ, ఎదుటివారిని మాటలతోనే ఇరకాటంలో పెట్టగల నేర్పు కూడా చెప్పుకోవాలి. దేశంలోనే రెండో అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్ర పతి పదవికి వెంకయ్య నాయుడు పోటీ చేస్తున్న వేళ ఆయన కుటుంబీకుల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. 
 
కృషి ఉంటే మనుషులు రుషులౌతారు. ఒక సిద్దాంతాన్ని నమ్ముకుని జీవితం కొనసాగిస్తూ నిబద్దతతో పనిచేస్తే ఎంతటి విజయ తీరాలకు చేరగలరో చెబుతోంది ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడు జీవితం. నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలో ఉండే చవటపాలెంలో జన్మించిన వెంకయ్యనాయుడు బాల్యం నుంచి చురుకైన వ్యక్తి. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నా ఉన్నతంగా ఎదిగాడు. 
 
ప్రాధమిక విద్యను సొంతూరు చవటపాలెంలోనే చదువుకున్న వెంకయ్య నాయుడు, తరువాత ఆరు నుంచి పదో తరగతి వరకూ నెల్లూరు లోని వెంకటగిరి రాజాస్ పాఠశాలలో పూర్తి చేశారు. తరువాత ఉన్నత విద్యను కూడా అక్కడే వెంకటగిరి రాజాస్ కాలేజీలోనే పూర్తి చేశారు. ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ తరపున పోటీ చేయబోతున్న వెంకయ్యనాయుడు సొంతూరును ఒక్కసారి గమనిస్తే ఎక్కడ చూసినా ఆయన జ్ఞాపకాలే పలకరిస్తాయి. 
 
ఏదేశమేగినా సొంత భూమిని ప్రేమించాలన్న విషయాన్ని ఒంటబట్టించుకున్న వెంకయ్యనాయుడు డిల్లీ స్థాయిలో నాయకుడిగా పనిచేస్తున్నా ఒక కంట తన సొంతూరు కనిపెట్టుకుని ఉండేవాడు. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకునేవాడు. తన సొంత గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేశారు. ఈ ఊర్లో ఎవరిని పలకరించినా వెంకయ్యనాయుడు తమవాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 
 
వెంకయ్య నాయుడు గురించి ఆయన మేనత్త చెప్పిన మాటలు వింటే ఎంతటి మహోన్నత వ్యక్తో అర్థమవుతుంది. తమ కళ్ల ముందే పెరిగి పెద్దవాడు అయిన వెంకయ్యనాయుడు చిన్నతనం నుంచి కూడా చురుగ్గా ఉండేవారని చెబుతోంది వెంకయ్యనాయుడు మేనత్త మనోహరమ్మ. ఈరోజు తమకు పెద్ద పండగ రోజన్నారు. ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా ఏమాత్రం గర్వం లేని వ్యక్తి  వెంకయ్య అన్నారు. ఊరిని అన్ని విధాలుగా అభివృద్ది చేశారన్నారు. 
 
ఆధ్మాత్మిక భావాలు ఎక్కువగా ఉన్న వెంకయ్యనాయుడు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్‌లో పనిచేశారన్నారు. ఊరి ప్రజల కోసం గుడిని కూడా నిర్మించారన్నారు. జూన్ 4వ తేదీన తమ గ్రామానికి వచ్చిన వెంకయ్యనాయుడు అందరినీ ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. ఇంత పెద్ద పదవి తమ వాడికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆమె.
 
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అవుతున్నారంటే నమ్మలేకపోతున్నామంటున్నారు ఆయన మరదలు అరుణ. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటున్నారు. తమ మామయ్యకు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికే వన్నె తెస్తారంటున్నారు. 
 
ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలని ఒక మహాకవి రాసిన పాట సరిగ్గా వెంకయ్యకు సరిపోతుంది. ఏ పదవిలో ఉన్నా కొంచెం కూడా గర్వం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరినీ సమానంగా, ఆప్యాయంగా పలుకరించే వ్యక్తి వెంకయ్యనాయుడు. అలాంటి మహోన్నతి వ్యక్తి, మన తెలుగువాడు ఉపరాష్ట్రపతి కానుండటంతో దేశప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి