స్వరాల బాటలో నడుస్తూ, సంస్కారపు బాటలో ముందుకు సాగిన ధన్యజీవి శ్రీ బాలు: ఉపరాష్ట్రపతి

శుక్రవారం, 10 జూన్ 2022 (22:39 IST)
స్వరాల బాటలోనే గాక, సంస్కారపు బాటలో తాను నడిచి, తమ తర్వాతి తరాలను కూడా ఆ దిశగా నడిపించేందుకు కృషి చేసిన శ్రీ శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ధన్యజీవి అని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలను మనదైన సంస్కృతి, సంప్రదాయాలకు నిజమైన వారసులుగా తీర్చిదిద్దడమే శ్రీ బాలూ గారికి అందించే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. తమ దృష్టిలో ఎస్పీ బాలూ అంటే తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన పాటకారే గాక, భాషా సంస్కృతులను ముందు తరాలకు చేరవేసిన మాటకారి అన్న ఉపరాష్ట్రపతి, శ్రీ బాలూ నాదోపాసనలో తరించడమే గాక, తమ మాటలతో యువతలో సంస్కార బీజాలు నాటేందుకు ప్రయత్నించారన్నారు.


బాలు జీవనరాగం-జీవనచిత్రం
హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌లో శ్రీ శ్రీపతిపండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం “జీవనగానం” పుస్తకాన్ని, శ్రీ బాలూ “జీవనచిత్రం” వీడియోను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. పుస్తక తొలి ప్రతిని ప్రముఖ నటుడు శ్రీ కమల్ హాసన్ కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ బాలూ స్మృతికి ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. శ్రీ బాలూ జీవిత యాత్రను సమగ్రంగా తెలియజేసిన జీవనగానం పుస్తక రచయిత డా. పి.ఎస్. గోపాలకృష్ణ గారికి, జీవన చిత్రం రూపకర్త శ్రీ సంజయ్ కిశోర్ గారికి అభినందనలు తెలియజేసిన ఆయన, పుస్తక ప్రచురణకర్త, చిత్ర సారధి డా. వరప్రసాద్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందించారు. హాసం సంస్థ ద్వారానే గాక, వ్యక్తిగతంగా తెలుగు భాష, సంస్కృతులకు, కళలను కాపాడుకుంటూ ముందుకు తరాలకు చేరేవేసేందుకు ఆయన చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, వారి చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.


శ్రీ బాలూ స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుంది
సంస్కారవంతుడు, స్నేహశీలి, మృదుస్వభావి, నిత్యకృషీవలుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ముందు తరాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉందన్న ఉపరాష్ట్రపతి, వృత్తిపట్ల నిబద్ధతతో పాటు, వారి వినయం, ఉత్సాహం లాంటివి వారి ప్రతిభకు వన్నె తీసుకొచ్చాయన్నారు. మనసు పెట్టి పని చేసే వారి లక్షణం... గాయకుడిగానే గాక, సంగీత దర్శకునిగా, నటునిగా, గాత్రదాతగా, టెలివిజన్ కార్యక్రమాల సూత్రధారిగా వారిని బహుముఖప్రజ్ఞాశాలిగా మలచిందన్నారు.


శ్రీ బాలూ జీవితం తెలుగు సినీ సంగీత చరిత్రలో ఓ స్వర్ణశకం అన్న ఆయన, ప్రజలకు రససిద్ధి కలిగించిన కళాకారులకు మరణం లేదని, తెలుగు ప్రజల జీవితాల్లోనూ, ఆలయ సుప్రభాత సంగీత నివేదనల్లోనూ శ్రీ బాలూ స్వరం నిత్యం ధ్వనిస్తూనే ఉంటుందని తెలిపారు. బాలు ప్రయత్నిస్తే తమలాగా పాడగలరు గానీ... తాము బాలూలాగా పాడలేమంటూ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అన్న మాటలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, శ్రీ బాలు గళంలో పలకని భావం గానీ, ఒప్పించని రసం గానీ లేవని పేర్కొన్నారు.


ఏసుదాసుకు పాదాభిషేకం
వారసత్వం అంటే పెద్దల జవసత్వాలను, సంప్రదాయాలను, విలువలను అందిపుచ్చుకోవడమేనన్న ఉపరాష్ట్రపతి, తండ్రి శ్రీ సాంబమూర్తి గారి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీ బాలూ తమ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉంటూ మంచి మార్గంలో ముందుకు సాగారని తెలిపారు. ‘భిక్షాటన పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభ’ను నెల్లూరులో స్థాపించి, ఎంతో వైభవంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను నిర్వహించే శ్రీ సాంబమూర్తి గారి కార్యక్రమాలను గుర్తు చేసుకున్న ఆయన, ‘నిధి చాలా సుఖమా... రాముని సన్నిధి చాలా సుఖమా..’ అన్న శ్రీ త్యాగరాజస్వామి బాటలోవారు ముందుకు నడిచారన్నారు. దైవదత్తంగా వచ్చిన గంధర్వ స్వరంతో అత్యున్నత స్థాయికి ఎదిగినా, తండ్రి స్ఫూర్తిని మరువకుండా నెల్లూరులోని ఇంటిని వేద పాఠశాల నిర్వహణకు అందజేయడం, ఎస్పీ కోదండపాణి పేరిట రికార్డింగ్ థియేటర్ ఏర్పాటు, ఘంటసాల విగ్రహ ప్రతిష్ట, ఏసుదాసుకు పాదాభిషేకం రూపంలో శ్రీ బాలూ కొనసాగించిన సంస్కారాన్ని ముందుతరాలు అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.

భారతదేశ అస్తిత్వం వెనుక మన  భాష, మన సంస్కృతి, మన కళారూపాలు ప్రధాన పాత్ర పోషించాయన్న ఉపరాష్ట్రపతి, మన వారసత్వం, మన ఆచార వ్యవహారాలను మన పెద్దలు కళల్లోనే నిక్షిప్తం చేశారన్నారు. అన్నమయ్య కీర్తనల్లో ఉగ్గు పెట్టడం మొదలుకుని, నేత కళాకారు జీవితాల వరకూ అనేక విశేషాలు అంతర్లీనంగా దాగి ఉన్నాయని, మన ప్రాచీన తెలుగు కావ్యాల్లో మన వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతాయని పేర్కొన్నారు. మన కళలను కాపాడుకోవడం ద్వారా మన భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవడం సాధ్యమౌతుందన్న ఆయన, ఈ దిశగా యువతరం శ్రీ బాలూ స్ఫూర్తితో ముందుకు నడవాలని ఆకాంక్షించారు.

పాడుతా తీయగా....
శ్రీ బాలూ లేకపోవడం తమ లాంటి ఎంతో మందికి వ్యక్తిగతంగా తీరని లోటు అన్న ఉపరాష్ట్రపతి, జీవితంలో కష్టపడి ఎదిగి... ఎంత ఎదిగినా ఒదిగి ఉండే శ్రీ బాలూ స్వభావం తనను ఆకట్టుకునేదన్నారు. పాడుతా తీయగా లాంటి కార్యక్రమ నిర్వహణ వెనుక బాలూ గారి శ్రమ, పిల్లలను గాయకులుగానే గాక, ముందు తరాలు అభిమానించి, గౌరవించే ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు వారు పడిన తపన అందులో కనిపిస్తుందని తెలిపారు. ఈ స్ఫూర్తిని తల్లిదండ్రులంతా అవగతం చేసుకోవాలన్న ఆయన, పిల్లలు ఎదగాలనుకుంటున్న తపనలో ఎలాంటి కల్మషం లేదని, పిల్లలను సానుకూల మార్గంలో ముందుకు నడిపేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు.

 
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు శ్రీ కమల్ హాసన్, శాంతా బయోటెక్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డి, శ్రీ బాలు గారి కుటుంబ సభ్యులు, పుస్తకరచయిత డా. పి.ఎస్. గోపాలకృష్ణ సహా పలువురు సినీ, సంగీత, సాహిత్య ప్రముఖులు, బాలూ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు