అన్నాడీఎంకేలో వైరి వర్గాలు ఏకంకానున్నాయి. అదీ కూడా మెరీనా తీరంలోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధిసాక్షిగా ఒక్కటికానున్నాయి. అదేసమయంలో ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తిరిగి ప్రమాణం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె పళనిస్వామి నియమితులు కానున్నారు. పార్టీ ‘పెద్దల’ సూచనతో పాటు.. మెజార్టీ మంత్రుల అభిప్రాయంతో అధికార అన్నాడీఎంకేలోని రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అదేసమయంలో నిన్నటివరకు విమర్శలతో, పరుషపదజాలంతో దూషించిన ఓపీఎస్‌కు ఇపుడు మంత్రులంతా జైకొడుతున్నారు.
అన్నాడీఎంకే నుంచి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ, ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌లను పార్టీ నుంచి వెలి వేస్తూ ఆ పార్టీ నేతలంతా ఐక్యంగా నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. దీంతో అన్నాడీఎంకేలోని ఇరువర్గాల నేతలు ఏకతాటిపైకి వచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా విలీన ప్రక్రియ ముగించేందుకు అటు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), ప్రస్తుత సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వర్గాలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం సీఎం ఎడప్పాడి కొందరు మంత్రులతో భేటీ అయి భవిష్యత కార్యాచరణపై చర్చించారు.
అలాగే, ఓపీఎస్‌తో సాధ్యమైనంత త్వరగా విలీనంపై చర్చించాలని పురమాయించారు. అదేసమయంలో ఓపీఎస్ కూడా తన నివాసంలో కొంతమంది నేతలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో గురువారం చర్చించి విలీనంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ఫిబ్రవరి నెలలో దివంగత సీఎం జయలలిత సమాధి సాక్షిగా శశికళపై ఓపీఎస్ తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సమాధిసాక్షిగా అన్నాడీఎంకేలో విలీనం కావాలని ఓపీఎస్ వర్గం భావిస్తోంది.
మరోవైపు.. దివంగత జయలలిత అనుచరుడిగా, ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడిగా, నమ్మినబంటుగా ఉండటమే కాకుండా, ప్రజల్లో గుర్తింపుతోపాటు.. మంచిపేరు తెచ్చుకున్న ఓపీఎస్‌నే సీఎం పీఠంపై కూర్చోబెట్టడం మంచిదని, డిప్యూటీ సీఎంగా ఈపీఎస్ ఉండాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మంత్రుల్లో మెజారిటీ సభ్యులు కూడా ఇదేవిధంగా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, అన్నాడీఎంకేలోకి ఓపీఎస్ రావడం ఖాయం కావడంతో మంత్రుల స్వరం పూర్తిగా మారిపోయింది. ఓపీఎస్ విశ్వాసానికి ప్రతీక అంటూ పొగిడేస్తుండటంతో తమిళ ప్రజలు విస్తుపోతున్నారు.