వద్దమ్మా రాములమ్మా.. నీకో పెద్ద దణ్ణం... ఎవరు?

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:22 IST)
రాములమ్మ అజ్ఞాతం వీడటం లేదు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి మెదక్ శాసన సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాక సైలెంట్ అయ్యారు. యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకనో లేక ఇతరత్రా కారణాలేమైనా ఉన్నా సరే రాజకీయాలకు మాత్రం విజయశాంతి దూరమైపోయారు.
 
చాలారోజుల తరువాత ఇటీవల బోనాల పండుగలో కనిపించారు విజయశాంతి. హైదరాబాద్‌లోని మహంకాళి అమ్మవారికి బంగారు కానుకలను అందించారు. ఇక రాములమ్మ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరి చురుకైన పాత్రను పోషిస్తారని అందరూ భావించారు. కానీ రాములమ్మ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. ఇటీవల రాహుల్ గాంధీ తెలంగాణా రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఆమె కనిపించకుండా పోవడం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరిచింది. తెలంగాణాలో ఇప్పుడు రాజకీయ వేడి రాజుకుంది. కెసిఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల గోదాలో దూకిన సంగతి తెలిసిందే.
 
తెలంగాణా ఇచ్చి కూడా అధికారంలోకి రాని కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా తెలంగాణాలో అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ప్లాన్‌లో ఉంది. ఈ ఎన్నికలను చావోరేవోగా భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాములమ్మ కాంగ్రెస్‌కు చేదోడు వాదోడుగా ఉండకపోవడం చర్చకు దారితీస్తోంది. పంతాలకు పోయి దూరంగా ఉండడం కాంగ్రెస్ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించడం లేదన్న ఆవేదనతో ఉందట విజయశాంతి. కాంగ్రెస్‌లో ఏ పదవిని విజయశాంతికి ఇవ్వలేదు.
 
ఎఐసిపిలో కీలక పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినా పట్టించుకోలేదు. తెలంగాణాలోని కాంగ్రెస్‌లో కూడా ఆమెకు పదవి ఇవ్వలేదట. దీంతో కాంగ్రెస్ పార్టీకి విజయశాంతి దూరంగా జరిగారట. ముందస్తు ఎన్నికల వస్తున్న తరుణంలో మళ్ళీ యాక్టివ్‌గా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని భావించి కొన్ని షరతులు పెట్టారట విజయశాంతి. దీంతో ఆ పార్టీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారట. అధికారంలోకి వచ్చిన తరువాత అడిగితే బాగుంటుందని, అంతేతప్ప ఇప్పుడే పదవులు కావాలని అడిగితే మేమేమి చేయగలమని ఆమెకు సమాధానమిస్తున్నారట.
 
దక్షిణాదిని షేక్ చేసే సినిమా గ్లామర్ తనదని అలాంటి తనను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని అంటోందట విజయశాంతి. ఎన్నికల సమయంలో పార్టీని గెలిపించేందుకు విజయశాంతి ప్రయత్నం చేయాలే తప్ప ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి రాములమ్మ దారెటో?

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు