మేనల్లుడు గెలుపు కోసమే అరెస్టు చేయించారు : తూర్పు జగ్గారెడ్డి

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (11:21 IST)
తెరాస అధినేత కేసీఆర్ మేనల్లుడు, తెరాస తాజా మాజీ మంత్రి టి.హరీష్ గెలుపు కోసమే తనను అరెస్టు చేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగ్గారెడ్డి ఆరోపించారు. భార్యాపిల్లల పేరుతో గుజరాతీ కుటుంబాన్ని అమెరికాకు అక్రమ రవాణా చేశారన్న కేసులో జగ్గారెడ్డిని పోలీసులు సోమవారం అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాహుల్ సభ తర్వాత తనను అరెస్ట్ చేసేందుకు కేసీఆర్, హరీశ్ రావు కుట్ర చేశారన్నారు. సిద్ధిపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావును గెలిపించుకునేందుకే తనను అరెస్ట్ చేశారన్నారు. కేసీఆర్, హరీశ్ రావుపై కూడా నకిలీ పాస్‌పోర్ట్ కేసులున్నాయని ఈ సందర్భంగా జగ్గారెడ్డి చెప్పారు. 
 
భార్యాపిల్లల పేరుతో వీసాలు తీసుకున్న జగ్గారెడ్డి ఓ గుజరాతీ మహిళ, ఆమె పిల్లలను 14 ఏళ్ల క్రితం అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వదిలి వచ్చేశారని సోమవారం సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు దాఖలైంది. దీంతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు మనుషుల అక్రమ రవాణా కింద జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి రాత్రికి రాత్రే అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు