ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల?!!

మంగళవారం, 26 డిశెంబరు 2023 (07:45 IST)
కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్. షర్మిలను నియమించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో ఆ పార్టీ పూర్తిగా సమాధి అయింది. ఒకపుడు కాంగ్రెస్ పార్టీని ఆదుకునే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇపుడు మళ్లీ పూర్వవైభవం కల్పించేందుకు కాంగ్రెస్ పెద్దలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిలకు అప్పగించనున్నారనే వార్తలు ఇపుడు సంచలనంగా మారింది. 
 
తెలంగాణలో విజయంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్‌ పెద్దలు ఏపీలో కూడా పార్టీ పుంజుకోవాలంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిలకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న నిర్ణయానికి దాదాపుగా వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్లు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే... కొత్త సంవత్సరం ప్రారంభంలోనే షర్మిల నియామకంపై ప్రకటన వెలువడే అవకాశముంది. 'మాకు సమయం ఎక్కువగా లేదు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరితే ఏపీలో కాంగ్రె్‌సతో పాటు ఆమె భవితవ్యం కూడా బాగుంటుందని భావిస్తున్నాం' అని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత అన్నారు. 
 
కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలతో షర్మిల ఇప్పటికే ఈ విషయంపై చర్చించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్‌కు కూడా ఈ విషయంపై సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.

రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలనపై వైసీపీలోనే తీవ్ర అసంతృప్తి ఉందని, ఆ పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే షర్మిలతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీకి అంతర్గత సమాచారం అందింది. షర్మిల కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమైన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని వారు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీతో ఉన్నది ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటర్లేనని, షర్మిల కనుక కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లుతారని భావిస్తున్నారు. 
 
అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ప్రకటించి కాంగ్రెస్‌ గెలుపునకు దోహదం చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందే ఆమె తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనానికి ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు. షర్మిలను చేర్చుకుని ఆంధ్రాలో ఆమె సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ నేతలు భావించారు. అప్పటి నుంచే ఆమెతో ఢిల్లీ పెద్దలు పరోక్షంగా, ప్రత్యక్షంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోరాదని, వైకాపా అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంత తీవ్ర ఒత్తిడి చేసినప్పటికీ లొంగకూడదని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్‌ జైలులో ఉన్నప్పుడు షర్మిలే వైసీపీని కాపాడారని గుర్తు చేస్తున్నారు. షర్మిలో ఉన్నది కాంగ్రెస్ రక్తమని, ఆమె మహానేత వైఎస్ఆర్ కుమార్తె అని, ఆమెకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకుంటుందని కాంగ్రెస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు